బోధనేతర విధులకు టీచర్లను దూరంగా ఉంచాలి
నిర్మల్,జనవరి30(జనంసాక్షి): ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని పీఆర్‌టీయూ కోరింది. దీంతో విద్యార్థులపై శ్రద్ద తగ్గడంతో పాటు సకాలంలో సిలబస్ పూర్తి కాదని అన్నారు. అలాగే ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. స్కూళ్లలో తగినంతగా టీచర్లు లేకున్నా తమ విద్యుక్త ధర్మంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు సిలబస్‌ను పూర్తి చేస్తున్నామని అన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వారిని ఉత్తీర్ణతలో ముందుంచుంచుతున్నామని అన్నారు. అయితే టీచర్లు ఏదో సుఖాలు అనుభవిస్తున్నట్లుగా కొందరు దుష్పచ్రారం చేస్తున్నారని అన్నారు. విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు పాఠశాలకు 137 రోజులే మాత్రమే వెళ్లి పని చేస్తారని ప్రచారం చేయడం తమ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఇది ఎంత మాత్రం సరికాదని అన్నారు. విద్యాశాఖ పరిశీలించిన విషయం అవాస్తవమన్నారు. సెలవులు మినహాయించి ఉపాధ్యాయులందరూ 220 పనిదినాలు పనిచేస్తారని చెప్పారు. సెలవులు వాడుకోవడం ఉపాధ్యాయుల హక్కు అని తెలిపారు.