బోనాలకు “పీర్జాదిగూడ” ముస్తాబు

జులై 24న అంగరంగ వైభవంగా జాతర
అన్ని ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్
జనంసాక్షి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల జాతరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ముస్తాబవుతోంది. ఈ నెల 24న ఆదివారం బోనాల వేడుకలు నిర్వహించేందుకు మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమీషనర్ డా. పి రామకృష్ణ రావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ పెద్దలు సంయుక్తంగా అంగీకరించారు. ఇకనుండి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి సంవత్సరం ఆషాడ మాసం చివరి ఆదివారం బోనాల పండుగను జరుపుకునేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. గతం సంవత్సరంలాగే ఈసారి కూడా బోనాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ భారీ ఏర్పాట్లు చేయనుంది. నగర పరిధిలోని అన్ని అమ్మవారి దేవాలయాలకు రంగులు వేయడం, విద్యుద్దీపాలంకరణ, పరిశుభ్రత, మంచి నీరు, బందోబస్త్ తో పాటు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేవిధంగా అధికారులకు దిశా నిర్దేశం చేసారు. మతసామరస్యానికి, తెలంగాణ జన జీవన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలైన బోనాల పండుగను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మేయర్, అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, పట్టణ పెద్దలు, డిఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.