బోరబండలో ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): సర్దార్‌ సర్వాయి పాపన్న 371వ జయంతిని బుధవారం బోరబండ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోరబండ సైట్‌-2 కాలనీలోని సర్వాయి పాపన్న విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్‌ మాట్లాడుతూ.. మొఘల్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న అన్నారు. 18వ శతాబ్దంలో ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ముందుకు సాగిన ధీరుడని పేర్కొన్నారు. పాపన్నను ప్రజలు చిరస్థాయిగా గుర్తు పెట్టుకునే విధంగా బాబా ఫసియుద్దీన్‌ చొరవతో బోరబండలో విగ్రహం ఏర్పాటుతో పాటు సైట్‌-2 కమ్యూనిటీహాల్‌కు సర్దార్‌ సర్వాయి పాపన్న అనే పేరును బల్దియా అధికారికంగా పెట్టిందన్నారు. బాబా ఫసియుద్దీన్‌ మాట్లాడుతూ.. గతేడాది పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారని..ఏటా పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. అనంతరం ముఖ్య అతిథులను గౌడ సంఘం నేతలు సన్మానించారు.