బోర్లాగ్ సదస్సుకు మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి
` తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని ఆహ్వానం
` అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. 24 నుంచి 26వరకు అమెరికాలో సదస్సు
హైదరాబాద్ (జనంసాక్షి):తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నిరంజన్‌రెడ్డికి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితాహహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్ ఇంటర్నేషనల్ సమావేశంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిగా సంస్థ ప్రతినిధులు మంత్రులకు సదస్సు స్వాగతం పలికింది. ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్ నగరంలో సదస్సుకు హాజరుకావాల్సి ఉండగా.. కేటీఆర్, నిరంజన్‌రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరుపై ఏటా సదస్సులు నిర్వహిస్తుండగా.. హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ను ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్’ అధ్యక్షుడు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, పురోగతిని గమనించి.. వ్యవసాయంలో పదేళ్లలో సాధించిన ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని మంత్రులకు ఆహ్వానం పంపింది. ఇక సదస్సులో ప్రపంచ వ్యవసాయరంగంలో ఆహార భద్రతకు ఎదురయ్యే సవాళ్లపై చర్చించనున్నారు. ప్రపంచ దేశాల నుంచి 1200 మంది ప్రతినిధులు ఈ సదస్సకు హాజరుకానున్నారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా వేలాది మంది పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22 నుంచి 29 వరకు మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాకు వెళ్లనున్నారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు బృందం సైతం అమెరికాకు వెళ్లనున్నది.