బోర్ల తవ్వకంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు

పెరుగుతున్న ఫ్లోరైడ్‌ సమస్యలు

నల్లగొండ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): విచ్చలవిడిగా నీటి వినియోగం పెరగడంతో జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. విచ్చలవిడిగా బోర్ల తవ్వకం కారణంగా భూగర్భ జలాలు అట్టడుగుకు చేరడంతో పాటు ఫ్లోరైడ్‌ సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బోర్లతో కొందరు నీటి వ్యాపారం చేస్తున్నారు. ఇదేనీటిని మినరల్‌ వాటర్‌ ప్లాంట్లుగా మార్చారు. రాక్‌ సాయిల్‌ ఉన్నచోట బోర్ల తవ్వకం వల్ల నీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఉంటుందన్నారు. వీటిని రీఛార్జ్‌ చేయకపోవడం వల్ల కూడా సమస్యు పెరిగాయని అంటున్నారు. వాననీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకేలా చేస్తే తప్ప ప్రయోజనం ఉండబోదని అన్నారు. దీనివల్ల ఎండాకాలంలో సమస్యలు వస్తున్నాయి. ప్రజలు వాననీటి సంరక్షణలో ముందుకు రాకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. బోర్లు వేసి భూమికి తూట్లు పొడవటంతో గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయి. ఇష్టారాజ్యంగా బోర్లు వేయడమే కాదు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వాననీటిని భూమిలోకి పంపినప్పుడే సమస్య తీవ్రత తగ్గుతుందని అధికారులు సూచించారు. నీటి వినియోగం పెరగడంతోపాటు వాననీటి సంరక్షణ చర్యలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి.వాల్టా చట్టం అమల్లోకి వచ్చినా బోర్లు తవ్వుకోడానికి అనుమతి తీసుకోవడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తే కొత్తగా తవ్వే బావులను మూసివేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బావుల తవ్వకాలకు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. దీనిని పటిష్ఠంగా అమలు చేస్తే భూగర్భ జలాల వృథాను అరికట్టవచ్చు. అక్రమ బోరుబావుల తవ్వకాన్ని నివారించి నీటి సంరక్షణ చర్యలు

తీసుకోవల్సిన అసవరం ఉంది.

 

తాజావార్తలు