బ్రిటన్‌ ప్రధానితో మన్మోహన్‌ భేటీ

అగస్టా కుంభకోణంలో సహకరించండి
సానుకూలంగా స్పందించిన కామెరున్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి):
2010లో భారత్‌- ఇటలీ మధ్య జరిగిన ఆంగ్లో ఇటాలియన్‌ హెలికాప్టర్ల ఒప్పందంపై వస్తున్న ఆరోపణలపై భారత్‌ ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో బ్రిటన్‌ ప్రధాని డేవడ్‌ కామెరూన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో దర్యాప్తుకు సహకరించాలని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తికి కామెరూన్‌ సానుకూలంగా స్పందించారని, దర్యాప్తుకు బ్రిటన్‌ పూర్తిగా సహకరిస్తుందని హావిూ ఇచ్చారన్నారు. భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని కామెరూన్‌తో ప్రధాని మన్మోహన్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఆర్థిక, రక్షణ, తదితర అంశాలపై చర్చించారు. అలాగే, అగస్టా
వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపైనా చర్చ జరిగింది. భేటీ ముగిసిన అనంతరం ఇద్దరు ప్రధానులు సంయుక్త సమావేశంలో మాట్లాడారు. 2010 నాటి ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఒప్పందంపై వస్తున్న ఆరోపణలను కామెరూన్‌ దృష్టికి తీసుకెళ్లారనని మన్మోహన్‌ తెలిపారు. దర్యాప్తులో బ్రిటన్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన హావిూ ఇచ్చారన్నారు. హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో భారత ప్రభుత్వానికి సహకిరస్తామని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ తెలిపారు. ఏ సమాచారం కావాలన్నా తాము ఇస్తామని చెప్పారు. ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చిన ఇటలీ అధికారులను ఆయన అభినందించారు. బ్రిటన్‌లో తాము ప్రవేశపెట్టిన అవినీతి వ్యతిరేక చట్టం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదని తెలిపారు. లంచాలకు ఆస్కారం లేకుండా చేశామన్నారు. అవినీతి ఎక్కడ ఎప్పుడూ జరగకుండా చూస్తున్నామని వివరించారు.