బ్రిటీషోళ్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం : కోదండరామ్
హైదరాబాద్, జనవరి 26 (జనంసాక్షి) :
దేశం నుంచి బ్రిటిషోల్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శనివారం నగరంలోని జేఏసీ కార్యాల యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీమాంధ్ర పెట్టుబడిదారులను ఇక్కడి నుంచి తరిమికొట్టి తెలంగాణ సాధిం చుకుందామని పిలుపునిచ్చారు. రాజ మండ్రి సభతో ఆంధ్రవాళ్ల ఆధిపత్యం మరోసారి ప్రస్ఫుటమైందని, ఇక వారితో కలిసి ఉండలేమని స్పష్టమైందని ఆయన అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారం సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడుతున్నామని అన్నారు. ఆత్మగౌరవం కోసం బతికే సమాజం కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నామని తెలిపారు. జాతీయ జెండా భారత జాతీయ పతకమే కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక అని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించే వరకూ పోరాడతామన్నారు. రాజమండ్రి సభతో సీమాంధ్ర నేతలు ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారని తేలిపోయిందన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. నీతిమాలినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యంగ విలువలపై సీమాంధ్ర నేతలకు నమ్మకం లేదని, అలాంటి వారితో ఎలా కలిసుంటామని ప్రశ్నించారు. ఆంధ్ర నాయకుల వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేస్తామన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, రాజ్యాంగస్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. జాతి విలువలకు పునాది తెలంగాణ అని అన్నారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. నీతిమాలిన రాజకీయం కింద బతకలేమని, ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నామని, అందుకే తెలంగాణను కోరుతున్నామని తెలిపారు.