భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
పుట్టలో పాలుపోసిన మహిళలు
హైదరాబాద్,అక్టోబర్23(జనంసాక్షి): కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో పాటు నాగులచవితి కూడా కలసి రావడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక సోమావరం పురస్కరించుకుని శైవాలయాల్లో అభిషేకాలు చేపట్టారు. పుణ్యతీర్థాల్లో నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేసిన భక్తులు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల మహిళలు నాగులచవితి సందర్భంగా పుట్టలో పాలుపోశారు. ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మహిళలు పుట్టలకు పూజలు నిర్వహించారు. తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ప్రధాన ఆలయాలు కిలకిటలాగాయి. పంచరామక్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 4గంటలకే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పవిత్ర స్నానాలు చేసిన మహిళలు శివాలయంలో పెద్ద ఎత్తున్న వత్తులు వెలిగించే కార్యక్రమం చేశారు. ఉసిరికొమ్మలకు పూజలు చేయడం,ఉసిరి చెట్లకు ప్రదక్షిణలు చేశారు. పలుచోట్ల గోమాతలకు పూజలు చేశారు. పౌర్ణమి సోమవారం రావడంతో భక్తులు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు చేశారు. ప్రజలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం,మహానంది, పంచారామాలు, కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గ, శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరమశివుడిని ప్రార్థించారు. ఉసిరి కాయల్లో దీపారాధనలు చేశారు. ఆలయాల్లో ప్రత్యేకంగా ఒత్తులు వెలిగించే కార్యక్రమంచేపట్టారు. అమరావతి, కోటప్పకొండ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలో కృష్ణాతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా ప్రాచీన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజన్న ఆలయం, కాళేశ్వరం,కీసర, ధర్మపురి, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి,రామప్ప ఆలయం, కొడవటూరు ఆలయాలకు భక్తుల పోటెత్తారు. నల్లగొండ ఛాయా మహేశ్వరాలంలో భక్తులు పోటెత్తారు. కృష్ణాతీరం, గోదావరి తీరాల్లో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బాసరలో ప్రత్యేక పూజలకు తరలివచ్చారు. ఉదయాన్ని పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసంలో జరిగే పుణ్యస్నానాలను పురస్కరించుకొని ఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. స్నానాలకు వచ్చిన భక్తులు ముందుగా గోదావరిస్నానాలు ఆచరించి తులసి,ఉసిరి పూజలు
నిర్వహించారు. వాయనాలను ఇచ్చి పుచ్చుకున్నారు. గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు
సమర్పించి స్నానాలు ఆచరించారు. మహానంది, యాగంటి, రాజమండ్రి, ద్రాక్షారామం, కోటిపల్లి, సామర్లకోట, పిఠాపురం, బీమవరం, పాలకొల్లు దేవాలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. తెల్లవారు జామునే పుణ్యస్నానాల చేసి దర్శనాలు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తున్నారు.చెరువుగట్టు, వాడపల్లి, పానగల్ దేవాలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు.