భద్రతపై పోలీస్ శాఖ సమన్వయం
ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఆసిఫాబాద్,మార్చి13(జనంసాక్షి): జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉండడంతో ఆ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకునేందుకు పోలీసు శాఖ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. ఇక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గత శాసనసభ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల్లో కలిపి మొత్తం 532 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పార్లమెంట్ ఎన్నికల కోసం అదనంగా 51 కేంద్రా లను ఏర్పాటు చేసి 583 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక శాసన సభ ఎన్నికలకు సంబంధించి రెండు నియోజక వర్గాల్లో కలిసి 3,71,444 ఉండగా ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,01,106కు పెరిగింది. ఇందుకు అనుగుణంగానే పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రెండు నియోజక వర్గాల్లో కలిసి 583 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నియోజక వర్గాల వారిగా చూసినప్పుడు సిర్పూర్ నియోజక వర్గంలో మొత్తం 283 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 300 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మొత్తం సిర్పూర్‌లో నియోజక వర్గంలో 2,02,580 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా ఇందులో మహిళ లు 1,00,471 మంది, పురుషులు 1,02,106 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజక వర్గంలో 1,98,526 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా ఇం దులో మహిళలు 99,324 మంది, పురుషులు 99,194 మంది, ఇతరులు ఎనిమిది మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఇందులో సమస్యా త్మక పోలింగ్ కేంద్రాలు 120, మావోయిస్టు ప్రభావిత కేంద్రాలు 73 ఉన్నట్లు తేల్చారు.