భద్రతా ప్రమాణాలు తగిన విధంగా లేవు
స్కార్పియో సహా 5 కార్లకు సున్నా రేటింగ్
రోడ్డు ప్రమాద పరీక్షలో విఫలం
జాబితాలో రెనో క్విడ్, మారుతీ సెలెరియో, ఈకో, హ్యుందాయ్ ఇయాన్‌లు
గ్లోబల్ ఎన్‌క్యాప్ వెల్లడి
భారత్‌లో విక్రయించే అన్ని కార్లూ భద్రమైనవే: సియామ్
న్యూఢిల్లీ: భారత్‌లో విక్రయమవుతున్న ఐదు కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు తగిన విధంగా లేవని గ్లోబల్ ఎన్‌సీఏపీ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్స్) వెల్లడించింది. మారుతీ సెలెరియో, ఈకో, రెనో క్విడ్, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ ఇయాన్… ఈ ఐదు కార్లు తమ క్రాష్ టెస్టుల్లో విఫలమయ్యాయని పేర్కొంది. భారత ప్రభుత్వ భద్రతా నియమ నిబంధనలకు అనుగుణంగానే కార్లను తయారు చేశామని మారుతీ, రెనో, హ్యుందాయ్ కంపెనీలు పేర్కొన్నాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్‌టెస్ట్‌లపై ఈ కంపెనీలతో పాటు సియామ్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. వివరాలు..
వాహన భద్రతకు సంబంధించి ఇంగ్లాండ్‌కు చెందిన గ్లోబల్ ఎన్‌సీఏపీ సంస్థ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ ఐదు కార్లకు జీరో రేటింగ్ లభించింది. తాజా క్రాష్ టెస్ట్ వివరాలను ఈ సంస్థ సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ మంగళవారం వెల్లడించారు. ఎయిర్ బ్యాగ్‌లతో కూడిన మోడల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్ల రెనో క్విడ్ కార్లను క్రాష్ టెస్ట్‌లు చేశామని, అన్ని కార్లకు జీరో రేటింగే వచ్చిందని డేవిడ్ వివరించారు. రెనో కూడా తగిన భద్రత లేని కార్లను తయారు చేయడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.
భారత నియమ నిబంధనల ప్రకారమే..
భద్రత నియమ నిబంధనలు కట్టుదిట్టంగా ఉండే యూరప్, అమెరికాల్లోనే గంటకు 56 కిమీ. వేగంతో స్పీడ్ టెస్ట్‌లు నిర్వహిస్తారని, కానీ గ్లోబల్ ఎన్‌సీఏపీ గంటలకు 64 కిమీ. వేగంతో ఈ స్పీడ్ టెస్ట్‌లు నిర్వహించిందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ ఒక ప్రైవేట్ సంస్థ అని, తన సొంత ప్రమాణాల మేరకు ఈ సంస్థ కార్లకు రేటింగ్‌లు ఇస్తుందని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణుమాధుర్ చెప్పారు. భారత్‌లో సగటు వేగం అంత కంటే తక్కువని పేర్కొన్నారు. తమ కార్లన్నీ భారత నియమనిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఒక రకంగా అంతకంటే మంచి ప్రమాణాలతోనే ఉన్నాయని మారుతి వెల్లడించింది. భారత ప్రభుత్వ భద్రతా ప్రమాణాల ప్రకారమే కార్లను తయారు చేశామని రెనో కంపెనీ స్పందించింది.