భద్రాచలంపై సిఎం కీలక ప్రకటనకు అవకాశం

ఖమ్మం,మార్చి26  (జ‌నంసాక్షి) : సిఎం కెసిఆర్‌ శ్రీరామనవమిని పురస్కరించుకుని రానుండడంతో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తున్నారు.  భద్రాచలంలో శ్రీరాముల వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అలాగే పట్టువస్త్రాలు అందిస్తారు. అదేవిధంగా భద్రాచల అభివృద్ది, ముంపు మండలాలపై కీలక ప్రకటన చేసే వీలుంది. దేవాలయ అభివృద్దికి నిధుల ప్రకటన చేసే అవకాశం ఉంది. పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఇలంబరిది జిల్లా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు తాజా ప్రగతిని వివరించే నివేదికలతో సన్నద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన, శ్రీరామనవమి ఏర్పాట్లపై కలెక్టర్‌ ప్రత్యేక సవిూక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈనెల 28న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతమయ్యేలా ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. హెలిక్టాపర్‌లో భద్రాచలం చేరుకునే సీఎం శ్రీసీతారాముల కల్యాణ మ¬త్సవంలో పాల్గొంటారు. అనంతరం భద్రాచలం నుంచి మణుగూరు వెళ్లి విద్యుత్తు ప్లాంటు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారని కలెక్టర్‌ తెలిపారు. ఆ కార్యక్రమం ముగియగానే అక్కడ్నుంచి హెలిక్టాపర్‌లో నేరుగా హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమవుతారన్నారు. భద్రాచలం, మణుగూరులో ఎలాంటి ఇబ్బంది లేకుండా హెలిక్టాపర్‌ సజావుగా దిగేందుకు వీలుగా హెలిప్యాడ్‌లను నిర్మించారు. ఇదిలావుంటే యాదగిరి తరహాలో భద్రాచలం ఆలయానికి కూడా ప్రత్యేక నిధులపై సిఎం ప్రకటన చేసే వీలుంది. ఆలయ అభివృద్దికి కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.