భద్రాద్రి మన్యంలో సత్ఫలితాలు ఇస్తున్న ప్రయోగాలు

ఉద్యాన పంటలతో పాటు యాపిల్‌ సాగు

భద్రాద్రికొత్తగూడెం,జూలై28(జ‌నం సాక్షి): విశాఖ మన్యంలో విజయం సాధించిన యాపిల్‌ సాగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండుమూడేళ్లుగా చేపట్టారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో రైతులు తెలంగాణ యాపిల్‌ సాగుతో లాభాలు పండిస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోందని జిల్లా ఉద్యాన శాఖాధికారి పేర్కొన్నారు. బూర్గంపాడు, అశ్వారావుపేట, దమ్మపేట, సుజాతనగర్‌లలో ఈ సాగు అధికంగా చేస్తున్నారన్నారు. క్షేత్ర పర్యటనలో పలుప్రాంతాల్లో పంటతీరును పరిశీలించి రైతులతో ముచ్చించి వివరాలు తెలుకున్నారు. రైతులు చేపట్టిన తెలంగాణ యాపిల్‌ సాగును పరిశీలించారు. ఆది 6 నెలల పంట అని ఒక చెట్టుకు 20-25 కిలోల దిగుబడి మొదటి సంవత్సరం వస్తుందన్నారు. తర్వాత 50-100 కిలోల దిగుబడి వస్తుందన్నారు. సేంద్రియ పద్దతిలో సాగుచేస్తే హెక్టార్‌కు 8వేల కిలోలదిగుబడి సాధించ వచ్చన్నారు. దీనికి మార్కెట్‌ డిమాండ్‌ కూడా ఉందన్నారు. విశాఖ మన్యంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఇక్కడా ఉన్నాయన్నారు. ఇకపోతే రైతులు కూరగాయల సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని పేర్కొన్నారు. కొద్దిపాటి వ్యవసాయం చేసే రైతులకు కూరగాయల సాగు మంచి లాభసాటిగా ఉంటుందని వివరించారు. అలాగే మామిడి మొక్కలు నాటినప్పటి నుంచి యాజమాన్య పద్దతులు పాటిస్తే లాభాలు వస్తాయని అన్నారు. ప్రతి మామిడి మొక్క ను మూడు అడుగుల గుంత తీసి అందులో వేపపిండి వేసి నాటాలన్నారు. మూడు నెలలకు ఒకసారి బలమైన మందులు వేసి 10 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలని గిరిజన రైతులకు సూచించారు. నీటి యాజమాన్య పద్దతుల సక్రమంగా పాటించటం వల్ల పంట బాగాపండి నాణ్య మైన పండ్లు దిగుబడి చేసుకోవచ్చని వివరించారు. మొగ్గ, పిందె దశలో తెగుళ్ల నివారణకు వాడే మందుల పై అవగాహన కల్పించారు. నాబార్డ్‌ అందించే సాయం కూడా పొందాలన్నారు.