భయపడుతూ బతికేది బతుకే కాదు : సీఎం
హైదరాబాద్, నవంబర్ 13 (జనంసాక్షి): బయపడుతూ బతికేది బతికే కాదు, ఎన్ని అవంతరాలు ఎదురైనా ధైర్య సాహసాలతో బతకాలని, అనుకున్నది సాధించే వరకు పోరాడాలని బాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆబిడ్స్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌భవన్‌లో..
బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ వారిని అభినందించారు. విద్యార్థులు పలు గీతాలను ఆలపించారు. జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను మననం చేసుకున్నారు.అనంతరం విద్యార్థులు తమ వెంట తెచ్చిన జ్ఞాపికలను గవర్నర్‌కు అందజేశారు. ఈ ఉత్సవంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కూడా పాల్గొన్నారు.
చాచా నెహ్రూకు జేజేలు!
భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ నాయకుడు.. పండిట్‌జీగా కీర్తించబడిన జవహర్‌లాల్‌కు జోహార్లు. బుధవారంనాడు ఆయన జయంతి. దేశానికి ఆయన అందించిన సేవలు మరోసారి మననం చేసుకుందాం.
జవహర్‌లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదు నగరంలో 1889, నవంబరు 14న జన్మించారు. స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూలకు తొలి సంతానమే నెహ్రూ. మోతీలాల్ న్యాయవాది. ఆనందభవన్‌లో నివసించేవారు. నెహ్రూ 15 ఏళ్ల వయస్సులోనే ఇంగ్లాండుకు చేరుకుని అక్కడ విద్యనభ్యసించారు. ఇంగ్లాండులోని హారో పాఠశాలలోను, ట్రినిటి కళాశాలలోను విద్యనభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలోను చదువుకున్నారు. ఆయన వివాహం 1916, ఫిబ్రవరి 8న కమలానెహ్రూతో జరిగింది. అనిబిసెంట్ మాటలకు ప్రభావితుడైన నెహ్రూ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. జలియన్ వాలాబాగ్‌లో డయ్యర్ జరిపిన హెచ్చరికలు లేని కాల్పుల వల్ల వేలాది మంది అమాయక ప్రజలు మరణించడం, గాయపడడం జరిగింది. ఈ సంఘటన తర్వాత మహాత్మాగాంధీతో నెహ్రూ సన్నిహితంగా మెలిగేవారు. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. 1934లో జాతీయ కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఏర్పడడంలో నెహ్రూ కీలకపాత్ర పోషించారు. స్వతంత్ర భారతావనికి 1947, ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. మరణించేంతవరకు అంటే 1964, మే 27వ తేదీ వరకు ప్రధాని పదవిలో దేశానికి సేవలందించారు. సుమారు 17 సంవత్సరాల పాటు ఆయన ప్రధానిగా కొనసాగారు. పంచశీల సూత్రాలను ప్రవేశపెట్టారు. ఈయన హయాంలోనే స్టీలు పరిశ్రమలు, పెద్ద పెద్ద కర్మాగారాలు, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. ఐఐటిల ఏర్పాటుకు విశేష కృషి చేశారు. తన కుమార్తె ఇందిరాప్రియదర్శిని అంటే చాలా అభిమానం. తాను జైల్లో ఉన్నప్పుడు ఆమెకు లేఖలు రాసేవారు. వాటిల్లో ఆయన రాసిన మాటలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. సాహిత్యంపై ఆయనకు అమితమైన అభిమానం ఉండేది. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలు అన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన ఎప్పుడూ తన కోటుపై గులాబీ పెట్టుకునేవారు. పిల్లలపై ఆయన అభిమానానికి గుర్తుగా ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిన విషయం తెలిసిందే. పిల్లలు ఆయనను చాచా నెహ్రూ అని పిలుచుకోవడం.. పిలుస్తుండడం..పూజిస్తుండడం..నిత్యకృత్యం.