భరోసా ఇవ్వని బాలల ఆరోగ్యరక్ష పథకం
మెదక్,ఆగస్ట్29(జనంసాక్షి): జిల్లాలో జవహర్ బాల ఆరోగ్యరక్ష కార్డులను పంపిణీ చేసినా కానీ ఎక్కడా పథకం అమలు కావడంలేదు. బాల్యానికి భరోసా ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు సుమారు 5 ల క్షలపైనే కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్డులు అన్ని దాదాపు మండల విద్యాశాఖ కార్యాలయాల్లో లేదంటే ప్రభుత్వ పాఠశాలల్లో మరీ కాదంటే విద్యార్థుల ఇళ్లల్లో మూలనపడ్డాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతీ విద్యార్థికి నెలకోసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వారి ఆరోగ్య స్థితిగతులను కార్డుల్లో నమోదు చేయాలి. ఏఎన్‌ఎంలు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెల కోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి.విద్యా, వైద్య శాఖల మధ్య సమన్వయ లోపం జవహార్ బాల ఆరోగ్య రక్ష పథకం అమలు కావాలంటే విద్యా, వైద్య శాఖల మధ్య సమన్వయం అవసరం. వైద్య పరీక్షలు
జరుపాలంటే మెడికల్ ఆఫీసర్‌తో పాటు- ఏఎన్‌ఎంలు, పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏఎన్‌ఎంలు తమ పరిధిలోని పాఠశాలలకు వెళ్లే పరిస్థితుల్లేవు. వైద్యశాఖపై విద్యాశాఖ పెత్తనం చేసే అజమాయిషీ లేదు. ఈ క్రమంలో రెండు శాఖల మధ్య సమన్వయం లోపించి విద్యార్థుల పాలిట శాపంగా మారింది.