భరోసా నింపిన బైడెన్ జోడి
అమెరికాలో విజయఢంకా మోగించిన బిడెన్, కమలా హారిస్ జంట చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు కొత్త అమెరికాను ఆవిష్కరించేవిగా ఉన్నాయి. అలాగే వారి మాటల్లో అందరినీ కలుపుకుని పోవానల్న బలమైన ఆకాంక్ష వ్యక్తం అయ్యింది. ఓట్లతో సంబంధం లేకుండా అమెరికన్లకు తాను ప్రసిడెంట్‌ను అని బైడెన్ చేసిన ప్రకటన అమెరికన్లలో కొత్త ఆశలు చిగురించేలా ఉన్నాయి. అలాగే ప్రపంచ దేశాల పట్ల కూడా స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తంగా విద్వేషాలకు తావులేని కొత్త అమెరికాను సృష్టించాలన్న బైడెన్ తపన ఆయన ప్రసంగంలో కనిపించింది. కలిసి పనిచేయాలని కూడా రిపబ్లికన్లకు పిలుపునివ్వడం ఆయన నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనంగా చూడాలి. నిజానికి ఏ దేశమైనా ఎన్నికల వరకే రాజకీయాలు అన్న పద్దతిలో సాగాలి. ఆ తరవాత దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ది లక్ష్యంగా ముందుకు నడవాలి. అప్పుడే అభివృద్దిలో పోటీపడగలరు. ఇప్పుడు బిడెన్, కమలాహారిస్ జోడీ అమెరికాను కొత్త శిఖరాలకు తీసుకుని పోయి, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిస్తే అంతకు మించిన ఆదర్శం ఉండదు. ప్రస్తుతం కొనసాగుతున్న రాక్షస పాలనకు తక్షణమే అంతం పలకాలనుకుంటున్నానని ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ వ్యాఖ్యానిం చడాన్ని అమెరికా ప్రజలు స్వాగతించారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించ కుండా.. అమెరికా ఎదుర్కొంటున్న బాధాకరమైన చీకటి సమయం అంతం కావడం ప్రారంభమైందని బిడెన్ పేర్కొన్నారు. విల్మింగ్‌టన్‌లో అభిమానులను ఉద్దేశించి బైడెన్ విజయోత్సవ ప్రసంగం ఆశ ఆభావంగా ఉంది. విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నట్లు చేసిన ప్రకటన అమెరికన్లలో ఆశలు నింపిందనడంలో సందేహం లేదు. ఇకపోతే కరోనా నివారణకు కూడా కార్యాచరణ చేపడతామని అన్నారు. అందుకు ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తానన్నారు. కోవిడ్ ప్లాన్‌ను రూపొందించి, అమలు చేసేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. పూర్తి శాస్త్రీయతతో ఆ ప్రణాళిక ఉంటుందన్నారు. నిజానికి అమెరికాలో కరోనా పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఇప్పటికే 2లక్షలకు పైగా ప్రజలు కరోనాతో మృత్యువాత పడ్డారు. చైనాపై ఆగ్రహంతో ప్రకటనలు చేసిన ట్రంప్ ఆరోగ్యపరంగా గట్టి చర్యలు తీసుకోలేదు. కరోనా కట్టడిలో నిర్లక్ష్యం వహించారు. అందుకే పాలనలో భిన్నంగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. సుదీర్థ రాజకయీ అనుభం ఉన్న బైడెన్ గతంలో రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కారణంగా ఆలోచనలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. వ్యాపార రంగం నుంచి వచ్చి ట్రంప్ తన పాలనలో అనుభవ రాహిత్యం బాగా కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసుకున్నారు. అందుకే బిడెన్ తనపై విూరు చూపిన విశ్వాసానికి రుణపడి ఉంటానన్నారు. నిజానికి అన్ని దేశాల్లో జరిగే ఎన్నికల ప్రచారానికీ, అమెరికాలో జరిగే ఎన్నికల ప్రచారానికీ చాలా తేడా వుంటుంది. వేరే దేశాల్లో అక్కడి ఆర్థిక విధానాలు, అంతర్గతంగా వుండే ఇతరేతర సమస్యలు, చాలా తక్కువ స్థాయిలో ఇరుగు పొరుగు సంబంధాలు చర్చకొస్తాయి. కానీ అమెరికాలో అంతర్గత సమస్యలతోపాటు విదేశాంగ విధానం, ప్రపంచ దేశాల తీరుతెన్నులు కూడా చర్చ నీయాంశాలే. అది చైనా కావొచ్చు, ఇరాన్ కావొచ్చు, సిరియా కావొచ్చు… అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు ఆ దేశాల్లోని పాలకులపై తమకు తోచిన తీర్పులిస్తారు. ఎవరెవరు అమెరికా ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నదీ వివరిస్తారు. తాము అధికారంలోకొస్తే ఆ దేశాలతో ఎలా వ్యవహరించ దల్చుకున్నదీ చెబుతారు. అయితే విదేశాంగ విధానంకన్నా ఈసారి ఆంతరంగిక సమస్యలే అమెరికా ఎన్నికల్లో ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి. ట్రంప్ ఏలుబడిలో అమెరికాను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వాటిలో ప్రధానమైనది కరోనా వైరస్ మహమ్మారి. మొదట్లో ట్రంప్ అదొక సమస్యే కాదన్నట్టు మాట్లాడారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు అనవసరంగా ఆంక్షలు విధించి, ప్రజల స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శాస్త్రవేత్తలపై కూడా ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. మొత్తంగా ట్రంప్ తీరు పట్ల ప్రజల ఆగ్రహం ఇప్పుడు ఓట్ల రూపంలో వెల్లడయ్యింది.అందుకే గత అనుభవాలను పరిశీలించిన బైడెన్ అమెరికా ఘన చరిత్రను పునర్లిఖించుదాం. ప్రపంచమంతా అమెరికాను మళ్లీ గౌరవించేలా చేద్దాం అని పిలుపునిచ్చారు. మనం శత్రువులం కాదు.. ఒకే దేశస్తులం. అమెరికన్లం అని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించే, సౌభాగ్య అమెరికాను పునర్నిర్మించే, విూ కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ముందుకు సాగుతామని బిడెన్ ప్రజలకు హావిూఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, ప్రజలందరికీ సమన్యాయం లభించే, వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని అంతం చేసే యుద్ధం చేయమని కోరుతూ నన్ను ఎన్నుకున్నారు. విూ నమ్మకాన్ని వమ్ము చేయనని బైడెన్ దేశ ప్రజలకు హావిూ ఇచ్చారు. ప్రపంచమంతా ఇప్పుడు అమెరికావైపు చూస్తోందని, ప్రపంచానికి అమెరికా దిక్సూచి అని విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. ఉపాద్యక్షపదవికి తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కమల హ్యారిస్ కూడా చాలా హుందాగా అమెరికా ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పే యత్నం చేశారు. విూరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారని ప్రకటించారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన గాయాలను మాన్పే శక్తి ఉన్న వ్యక్తి’అని మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. తాను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్త్రీని మాత్రం కాను అంటూ మహిళల్లో భరోసా నింపారు. ఇకపోతే మొత్తంగా అమెరికన్లలో ఆశలు నింపిన ఈ జోడీ అమెరికాను కొత్త తీరాలకు తీసుకెళితే అంతకు మించిన అదృష్టం మరోటి లేదు.