భర్తపై క‌త్తితో దాడి చేసిన భార్య

-చాకుతో మెడపై పొడిచిన నవవధువు

-ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఘటన

 శ్రీకాకుళం(జ‌నం సాక్షి): వీరఘట్టం మండలానికి చెందిన నవ వరుడు హత్య ఘటన సంచలనం కలిగించిన విషయం విదితమే. భార్య పన్నిన కుట్రతో భర్త ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జిల్లా ప్రజలు మరువక ముందే.. అచ్చం ఇలాంటి ఘటనే సంతబొమ్మాళి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. భార్య బరితెగించి భర్తపై చాకుతో దాడి చేసి గాయపరిచింది. పెళ్లయిన 20 రోజులకే తాళికట్టిన భర్తపైనే భార్య దాడి చేసిన సంఘటన చర్చనీయాంశమైంది. . మాలనర్సాపురం గ్రామానికి చెందిన బుడ్డ నవీన్‌కుమార్‌(23)కు గొదలాం గ్రామానికి చెందిన సబ్బి నీలిమ(19)తో ఈ నెల 9వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి అయిన రోజు నుంచి సరదాగా ఉన్న ఈ నవ దంపతులు నాలుగు రోజుల క్రితం నవీన్‌కుమార్‌ అత్తవారి గ్రామమైన గొదలాం వెళ్లారు. తిరిగి సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై మాలనర్సాపురం బయల్దేరారు. ఈ క్రమంలో వడ్డివాడ రైల్వేగేటు వద్ద భర్త తలపై నీలిమ చేతితో గట్టిగా కొట్టింది. ఏంకొట్టావు అని భర్త నవీన్‌ అడగ్గా సరదాగా కొట్టానని చెప్పడంతో నిజమేననుకొని ప్రయాణం కొనసాగించారు.అయితే మాలనర్సాపురం సమీపంలో తోటలు వద్దకు రాగానే నీలిమ వెంట తెచ్చుకున్న చాకుతో భర్త నవీన్‌కుమార్‌ మెడపై పొడిచింది. దీంతో ద్విచక్ర వాహనం ఆపాడు. వెంటనే భర్త పీక పిసికేందుకు నీలిమ ప్రయత్నించింది. దీంతో భయాందోళనకు గురైన నవీన్‌కుమార్‌ అక్కడ నుంచి తప్పించుకొని పెద్దగా కేకలు వేశాడు. దీంతో సమీపంలో ఉన్నవారు వచ్చి ఏంజరిగిందోనని ఆరాతీశారు. మెడపై గాయం కావడంతో రక్తం మడుగులో ఉన్న నవీన్‌కుమార్‌ను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై భార్య నీలిమను పలువురు ప్రశ్నించగా ఏం జరిగిందో తెలియలేదని, తాను చాకుతో పొడవలేదని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. సంతబొమ్మాళి ఎస్సై రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆమెను విచారిస్తున్నారు.