భవిష్యత్ తరాల..
ప్రశాంత జీవనం కోసమే హరితహారం
– ఈ ఏడాది ఇప్పటి వరకు 23కోట్ల మొక్కలు నాటాం
– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
– మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతాం
– రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, జోగురామన్న
– సిద్ధిపేటలో ఒకేరోజు 51వేల మొక్కలు నాటిన ప్రజలు
– పాల్గొన్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు
సిద్దిపేట, ఆగస్టు28(జనం సాక్షి) : భవిష్యత్ తరాలు ప్రశాంత జీవనం సాగించేలా, వారికి ఇబ్బందులు లేకుండా చూసేలా సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారని, దీనిలో భాగంగా హరితహారం కార్యక్రమం ఒకటని రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, అటవీశాఖ మంత్రి జోగురామన్నలు అన్నారు. సిద్దిపేటలో మంగళవారం ఒకేరోజు 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటి వరకు 23 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. మనందరి భవిష్యత్ బాగుండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతామన్నారు. హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అన్నారు. నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.



