భాజపా ఎంపీకి జరిమానా!

4

– సరిబేసి నిబంధనల ఉల్లంఘన

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):దిల్లీలో భాజపా ఎంపీ విజయ్‌ గోయెల్‌కు రోడ్డు రవాణా శాఖ అధికారులు జరిమానా విధించారు. నగరంలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ సరి-బేసి వాహన విధానం అమలును ఏప్రిల్‌ 15 నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆప్‌ రాజకీయ నాటకాలకు వ్యతిరేకంగా తాను సరి-బేసి విధానాన్ని అతిక్రమిస్తున్నానని విజయ్‌ గోయెల్‌ ప్రకటించారు. దిల్లీ ప్రభుత్వం ప్రకటనలకు ఎంత మొత్తం వెచ్చిస్తోందో వెల్లడించాలన్నారు.సోమవారం ఉదయం విజయ్‌ గోయెల్‌ నిబంధనలు అతిక్రమించడంతో దిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆయనకు రోజా పూలు ఇచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన వినలేదు. తర్వాత దిల్లీ పోలీసులు విజయ్‌ గోయెల్‌కు రూ.2వేల జరిమానా విధించారు. తాను ఈ విధానానికి వ్యతిరేకం కాదని, కానీ దిల్లీ ప్రభుత్వం దీనివల్ల రాజకీయ లబ్ధి పొందడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు విజయ్‌ గోయెల్‌ పేర్కొన్నారు. రూ. 2వేలు జరిమానా చాలా ఎక్కువని అది తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలు రెండు కారులు కొనుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు.రెండో దశ సరి-బేసి వాహన విధానం అమలైన తర్వాత సోమవారం తొలి పనిదినం కావడంతో దిల్లీ రోడ్లపై విపరీతమైన రద్దీ కనిపించింది. ప్రజా రవాణా వాహనాల్లోనూ రద్దీ బాగా పెరిగింది.