భాజపా కార్యాలయమే నిందితుల తొలి లక్ష్యం

` రామేశ్వరం కేఫ్‌లో ఘటనలో ఎన్‌ఐఏ తొలి ఛార్జిషీట్‌
దిల్లీ(జనంసాక్షి): బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నలుగురిని నిందితులుగా పేర్కొన్న ఎన్‌ఐఏ..
ఈ ముష్కరుల తొలి టార్గెట్‌ బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న భాజపా కార్యాలయాన్ని పేల్చడమేనని వెల్లడిరచింది. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజే భాజపా కార్యాలయంపై ఐఈడీ దాడికి విఫలయత్నం చేసినట్లు తెలిపింది. ఆ తర్వాతే రామేశ్వరం కేఫ్‌ పేలుడుకు ప్లాన్‌ చేశారని తెలిపింది. బెంగళూరు ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో ఈ అంశాలను ప్రస్తావించింది. రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహా, మాజ్‌ మునీర్‌ అహ్మద్‌, ముజామ్మిల్‌ షరీఫ్‌లను నిందితులుగా చేర్చింది. వీరిలో షాజీబ్‌, తాహాలు ఐసిస్‌ రాడికల్స్‌ అని తెలిపింది. ఈ దాడుల కోసం డార్క్‌ వెబ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన భారత్‌, బంగ్లాదేశ్‌ గుర్తింపు కార్డులను ఉపయోగించినట్లు గుర్తించింది. ఇప్పటికే అరెస్టయిన ఈ నలుగురూ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లు తెలిపింది.మార్చి 1న బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో బాంబు దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. మార్చి 3న ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ.. వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఏజెన్సీల సమన్వయంతో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించింది. ఇందుకోసం పలు సాంకేతిక, క్షేత్రస్థాయి పరిశోధనలు సైతం నిర్వహించింది. షాజీబ్‌ అనే నిందితుడు బాంబును అమర్చాడని విచారణలో వెల్లడైందని వెల్లడిరచింది. కర్ణాటకలో టార్గెట్‌ హత్యలు, ఇతర జిహాదీ కార్యకలాపాలకు సంబంధించిన కుట్రలు 2020లో భగ్నం కావడంతో తాహాతో కలిసి షాజీబ్‌ పరారయ్యాడని తెలిపింది. రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన జరిగి 42 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో దాక్కున్న ఈ నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తాజావార్తలు