భాజపా తప్పుడు ప్రచారం చేస్తుంది

తాను బంగ్లాను ధ్వంసం చేయలేదు
తప్పుడు ప్రచారంతో తనపై కుట్ర చేస్తున్నారు
యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌
లఖ్నో, జూన్‌13(జ‌నం సాక్షి) : ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వెళ్లేటప్పుడు అందులోని కొన్ని వస్తువులను తీసుకెళ్లారని, ఇంటిని పాడుచేశారని వస్తున్న వార్తలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ స్పందించారు. బంగ్లాను ధ్వంసం చేసి వెళ్లిపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇదంతా భాజపా చేస్తున్న కుట్ర అని ఆయన మండిపడ్డారు. ‘ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ నేతల చేతిల్లో భాజపా వరుసగా పరాజయం పాలైంది. అందుకే భాజపా ఈ విధంగా కుట్ర పన్నుతోంది’ అని అఖిలేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విక్రమాదిత్య రోడ్‌లో అఖిలేశ్‌ ఖాళీ చేసిన బంగ్లాలో ఏసీలు, టైల్స్‌, మార్బుల్స్‌, గార్డెన్‌ లైట్లు కనిపించకుండా పోయాయని ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ ఇంట్లో టైల్స్‌ లేని ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో దీనిపై విచారణ జరిపి మాజీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ రాంనాయక్‌ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ఆస్తికి నష్టం వాటిల్లే విధంగా ఎవరు ప్రయత్నించినా.. వారిపై నిబంధన ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ సీఎంకు సూచించారు. మాజీ ముఖ్యమంత్రులందరూ ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు కొంత సమయాన్ని ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువుకు ఒక్కరోజు ముందు మాజీ సీఎం అఖిలేశ్‌తో పాటు ఆయన తండ్రి ములాయం సింగ్‌ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేసి వేరే ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే.. అఖిలేశ్‌ ఉండి వెళ్లిన ఇంట్లో కొన్ని ఖరీదైన వస్తువులు కనిపించకుండా పోయినట్లు వార్తలు వచ్చాయి.