భానుడి భగభగలు
– ఏపీలో ఉగ్రరూపం దాల్చిన ఎండలు
– నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు
– మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
– వెల్లడించిన వాతావరణ శాఖ
అమరావతి, మే30(జనం సాక్షి) : ఏపీలో భానుడి భగభగలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.. ఉదయం నుంచి సాయంత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయన్న చల్లని కబురు అందినప్పటికీ.. ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు విస్తరించడానికి మరో మూడు నాలుగు రోజుల సమయం ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉక్కపోత, వేడి పరిస్థితులు నెలకొన్నాయి. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణ పవనాల కారణంగా ఏపీ తెలంగాణల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ, ఛత్తీస్‌గఢ్ విూదుగా తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాల వరకూ ఈ ఉష్ణగాలుల ప్రభావం ఉండటంతో ఆ ప్రాంతాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆంధప్రదేశ్‌లో బుధవారం నెల్లూరులో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడ, అమరావతి, ఒంగోలు, కర్నూలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇక గుంటూరు, ఏలూరు, తిరుపతిలో 43, కడపలో 42, రాజమండ్రి, విజయనగరంలో 41డిగ్రీలు, శ్రీకాకుళం, అనంతపురంలో 40, విశాఖలో 38, కాకినాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు మరో 48 గంటలపాటు కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
—————————————————-