భారతీయులు శాంతి కాముఖులు
– బీహార్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ
– దలైలామా
జలంధర్ నవంబర్ 15 (జనంసాక్షి):
దేశంలోని మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను విశ్వసిస్తారని, భారతీయులు శాంతి కాముకులని బిహార్ ప్రజాతీర్పే నిదర్శనమని బౌద్ధుల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా పేర్కొన్నారు. ‘భారత్‌లో సుదీర్ఘకాలం నుంచి శాంతి, సామరస్యపూర్వక సంప్రదాయం నెలకొని ఉంది. ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ప్రజాతీర్పు కూడా.. మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను కోరుకుంటున్నారని ఋజువు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే దలైలామా ఏ రాజకీయ పార్టీ పేరును నేరుగా ప్రస్తావించలేదు.’ఈ సామరస్య వాతావరణం కారణంగానే మతసహనం కలిగిన దేశంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ అన్ని మతాలకు, వ్యక్తులకు సమాన హక్కులు కలవు’ అని ఆయన చెప్పారు. జలంధర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దలైలామా విలేకరులతో మాట్లాడారు. ‘మతసహనం అంటే అన్ని మతాలను గౌరవించడమే కాదు వ్యక్తులను కూడా గౌరవించడం. అందువల్లే బౌద్ధమతం భారత్‌లో పుట్టింది. అందువల్లే భారత్‌ను గురువుగా, బౌద్ధులను శిష్యులుగా భావిస్తారు’ అని ఆయన చెప్పారు.