భారత్‌ చేరుకున్న గీత

5
– ప్రధాని మోదీతో భేటి

– డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే తల్లిదండ్రలకు అప్పగింత

న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి):పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన భారత్‌కు చెందిన గీత స్వదేశానికి చేరుకుంది. కరాచీ నుంచి విమానంలో గీత, ఈదీ ఫౌండేషన్‌కు చెందిన ఫహాద్‌, బిల్‌క్విన్‌ ఈదీలు దిల్లీకి చేరుకున్నారు. సుమారు ఏడెనిమిదేళ్ల వయసులో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో కూర్చుని ఉన్న మూగ, బధిర బాలిక గీతను లా¬ర్‌ రైల్వే స్టేషన్‌లో పాకిస్థానీ రేంజర్లు కనుగొని ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. 15 ఏళ్లుగా కరాచీలోని ఈధి ఫౌండేషన్‌ సంరక్షణలో గీత ఉంటోంది.బిహార్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులను ఫోటో ఆధారంగా గీత గుర్తించింది. గీతకు డీఎన్‌ఏ పరీక్షలు చేసిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే దిల్లీ, ఇండోర్‌లోని రెండు సంస్థల్లో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.డీఎన్‌ఏ పరీక్షల్లో గీతా తమ కూతురే అని నిర్ధారణ చేస్తాయని ఆమె రాకకోసం ఎదురు చూస్తున్న తండ్రి జనార్దన్‌ మహతో అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కూతురు తిరిగి రావడంతో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పారు. తన కుటుంబమంతా ఆమెతో కబుర్లుపంచుకునేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి లోనైన ఆయన కళ్లు చెమర్చుతూ’పదహారేళ్ల తర్వాత నా కూతురు కనిపించడం ఆనందంగా ఉంది. డీఎన్‌ఏ పరీక్షలు కూడా గీత నా కూతురే అని చెబుతాయి. నాకు తెలుసు.. ఆమె నాకూతురే. తప్పకుండా నా దగ్గరికి వస్తుంది. నన్ను ప్రేమగా హత్తుకుంటుంది. ఈ సందర్భంగా భారత  విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు  ధన్యవాదాలు చెప్తున్నాను’ అంటూ జనార్దన్‌ పేర్కొన్నాడు.