భారత్ మతస్వేచ్ఛ హరిస్తోంది
– మోదీ సర్కారుపై అమెరికా ఫైర్
వాషింగ్టన్, అక్టోబర్ 15 (జనంసాక్షి):
భారత్‌లో మత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై అమెరికా ఆరోపణలు గుప్పించింది. 2014-అంతర్జాతీయ మత స్వేచ్ఛపై తయారు చేసిన నివేదికను అమెరికా మంత్రి జాన్ కెర్రీ వాషింగ్టన్‌లో విడుదల చేశారు. భారత్‌లో మతపరమైన ఆరోపణలతో మైనార్టీలపై హింస జరుగుతోందని, ఈ కారణంగా హత్యలు కూడా జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఘర్ వాపసీ పేరుతో ఇతర మతాల్లోకి మారుతున్న హిందువులను వేలాదిగా మళ్ళీ హిందూమతంలోకి తీసుకురావడం అన్యాయమని అమెరికా అంటోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమం గురించి అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం వీరిని అదుపుచేయలేకపోతోందని అమెరికా ఆరోపించింది. మరోవైపు భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని కేంద్రం అమెరికాకు తమ నిరసనను తెలిపింది.