భారత్ నిరుపేద దేశమే!

Raghuram-Rajanభారత్ ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించడం ఏ మాత్రం మంచిది కాదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. భారత్ ఇప్పటికీ ప్రపంచంలోని నిరుపేద దేశాల్లో ఒకటని, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నదన్నారు. మనం తరచు పోల్చుకునే చైనానే తీసుకుంటే ఒక సగటు భారతీయుని కన్నా సగటు చైనా జాతీయుడు నాలుగు రెట్లు సంపన్నుడని ఆయన చెప్పారు. అలాగే బ్రిక్స్ దేశాలన్నింటిలోనూ తలసరి ఆదాయం మన దేశంలోనే అతి తక్కువ అని రాజన్ అన్నారు. ప్రతి ఒక్క భారతీయునికి హుందాతో జీవించగల అవకాశం అందించాలంటే కనీసం 20 సంవత్సరాల పాటు ప్రస్తుత వృద్ధిని కొనసాగించాల్సి ఉంటుందని రాజన్ అన్నారు. సంస్కరణాత్మక విధానాలను పదే పదే ఆచరిస్తూ పోవడం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక వృద్ధి సాధ్యమని రాజన్ అన్నారు. ఒక గమ్యాన్ని చేరామని చెప్పడానికి ముందు మనం చాలా దూరం ప్రయాణం చేయడం అవసరమన్నది గుర్తించాలని రాజన్ తెలిపారు.