భారత తటస్థ వైఖరి లాభించేనా ..?`
రష్యా`ఉక్రెయిన్ వ్యవహారంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ముందు ఇంతకన్నా దారి లేదనే చెప్పాలి. శాంతిని ఉపదేశించి.. యుద్ధం వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత్కోరినా పుతిన్ వెనక్కి తగ్గలేదు. ప్రపంచం యావత్తూకోరినా పుతిన్ వెనక్కు తగ్గేలా లేరు. ఈ క్రమంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న పెద్దగా ప్రభావం ఉండదని గమనించాలి. భారత్ వైఖరిని తప్పుపడుతున్న వారు ఇంతకన్నాఏం చేయగలరో చెప్పాలి. ఉక్రెయిన్‌పై దాడి జరిగిన దరిమిలా ఇప్పటి వరకు ప్రపంచదేశాలు ఏవిూచేయలేక పోయాయి. తమను ఒంటరిగా వదిలేశారిన ఉక్కెయిన్ అద్యక్షుడే వాపోయాడు. అయితే, భారత్ తటస్థ వైఖరి పట్ల పాశ్చాత్య దేశాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో యుద్ధం జరగకుండా ఆపగలదని ఉక్రెయిన్ భావిస్తున్నా..అదంతా భ్రమేనని భావించాలి. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆపడం ఎవరి తరమూకాదు. ఇప్పుడు ప్రపంచమంతా వ్యతిరేకిస్తేన్నా ఆయన దాడులను ఆపడంలేదు. భారత్ తటస్థంగా ఉండిపోవ డంతో పాశ్చాత్య దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. అయితే రష్యాకువ్యతిరేకంగా ఉన్నావచ్చే ఉపయోగం కూడా ఉండదు. ఉక్రెయిన్ సమస్యపై భారతదేశం సందిగ్ధత ఇలాగే కొనసాగితే, అది అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక సంబంధాలను ప్రమాదంలో పడేస్తుందని కొందరి వాదనగా ఉంది. . సరిహద్దుల్లో చైనా ఆగడాలను ఎదుర్కొవడం భారత్‌కు కష్టతరం అవుఉందని కొందరు అంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌తో పాటు పాశ్చాత్య దేశాల మద్ధతు ఇండియాకు అవసరం. కానీ, ఇలా తటస్థంగా ఉంటే.. ఒకవేళ చైనా భారత్‌పై దాడి చేసిన్లటైతే ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టడం కష్టమవు తుందని కొందరి వాదనగా ఉంది. అయితే ఈ రెండు సమస్యల తీవ్రత వేరు. బలమైన దేశాలైన ఆస్టేల్రియా, జపాన్ రెండూ పుతిన్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి.. అమెరికా పంచన చేరాయి. భారత్ మాత్రం ఇప్పటికీ మౌనంగా ఉంటూ ఒంటరిగా మిగిలిపోయింది. 1962 దక్షిణ టిబెట్‌ను విముక్తి కల్పించే నెపంతో చైనా ఇండియాపై మెరుపుదాడికి పాల్పడిరది. అలాంటి దాడినే అరుణాచల్ ప్రదేశ్‌పై చేస్తే ఇండియా పరిస్థితి వేరుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చర్యలను భారత్ ఖండిరచకపోతే.. చైనా విషయంలో ప్రపంచ మద్ధతు పొందడం కష్టతరం అవుతుందన్ని మరికొందరి వాదనగా ఉంది. ఇప్పటికే హిమాలయాల్లో చైనా అలజడి మరింత పెరిగింది. విస్తృతమైన సైనిక విన్యాసాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నా..రష్యాను నిలువరించే వక్తి భారత్‌కు లేదని తెలుసుకోవాలి. అమెరికా తదితరయూరప్ దేశాలకే పుతిన్ లొంగడం లేదు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రష్యాకు మద్ధతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేశాలన్నింటికీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తీవ్రంగా హెచ్చరించారు. తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ వారింగ్ ఇచ్చారు. ఇక రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు భారీ ఎత్తున ఆంక్షలు విధించాయి. నాటోలో చేరాలనే ఉక్రెయిన్ సంకల్పం.. పుతిన్‌ను కలవర పెట్టింది. ఆ భయం కారణంగానే పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు. సైనిక దాడిని ప్రారంభించడానికి ముందు ఉక్రెయిన్ ప్రత్యేక జాతీయత వాదనను పుతిన్ తిరస్కరించారు. రష్యా భద్రతను దాడికి కారణంగా చూపారు. ఈ కారణం భారత్‌కు కొంత ఊరటగానే చెప్పవచ్చు. ఎవరి భద్రతా కారణాలు వారికి ఉంటాయి. భద్రతా పరమైన సమస్యల పరిష్కారం లో కల్పించుకోవడం అనేది అతి అవుతుందని భారత్ వాదించే అవకాశం ఉంది. అయితే, పుతిన్
ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా ప్రమాదంలో పడ్డారు. రష్యా తీరు యావత్ ప్రపంచాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఫలితంగా.. రష్యాను చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం భారత్‌పైనా ఉన్నప్పటికీ.. రష్యాను వ్యతిరేకించడం అనేది కష్టమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే రష్యాతో భారత్‌కు కొన్ని దశబ్దాలుగా మంచి స్నేహ బంధం ఉంది. ఇకపోతే రేపు ఇదే ధోరణిలో చైనా తైవాన్‌పై దాడికి దిగితే భఆరత్ ఆక్రమిత కాశ్మీర్‌లో అడుగు పెట్టడానికి అవకావం వస్తుంది. కాబట్టి రష్యా విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం ఓ రకంగగా మంచిదనే చెప్పాలి. అలాగే మిన్నకుండా ఉండలేదు. పుతిన్‌తో మాట్లాడిన భారత ప్రధాని మోడీ కాల్పుల విరమణ ప్రతిపాదనను చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను దాదాపుగా తమ ఆధీనంలోకి తీసుకున్న రష్యన్ బలగాలు.. ఇప్పు మరో నగరంపైపు దూసుకెళ్తున్నారు. రష్యా మెరుపుదాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల సాయం కోరుతోంది ఉక్రెయిన్. ఆదేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు ఫోన్ చేసి మరీ సాయం అర్ధిస్తున్నారు. అండగా నిలవాలని కోరుతున్నారు. ఇకపోతే.. రష్యా దాడుల నేపథ్యంలో భారత్ బాధ్యత మరింత పెరిగిందనే చెప్పాలి. రష్యాను నిలువరించగల శక్తి ఒక్క భారత్‌కే ఉందని ఉక్రెయిన్ భావిస్తోంది. అందుకే తమకు అండగా నిలవాలని, యుద్ధం ఆపేలా రష్యాకు సూచించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం అర్ధించింది. అందుకే తక్షణమే యుద్దాన్ని విరమించి, దౌత్యపరమైన చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా.. దేశ భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తప్పడం లేదని, దీనిని ఇతర దేశాలు అర్థం చేసుకోవాలని పుతిన్ కోరారు. అంటే భారత్ తన ప్రయత్నాలు తాను చేస్తూనే సంబంధాలు దెబ్బతినకుండా చూసుకుంటున్నది గమనించాలి. అందుకే ఈ యుద్ధంపై తాము తటస్థ వైఖరిని అవలంభిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. చివరికి ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి కూడా దూరంగా ఉండిపోయింది.