భారత హైకమిషన్‌ను సందర్శించిన టీమిండియా

– బీసీసీఐ తీరుపై మండిపడ్డ నెటిజన్లు
– అనుష్కా వైస్‌ కెప్టెనా అంటూ ప్రశ్నలు
లండన్‌, ఆగస్టు8(జ‌నం సాక్షి) : లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని టీమ్‌ ఇండియా క్రికెటర్లు సందర్శించారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు భారత హైకమిషన్‌ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించింది. ఈ కార్యక్రమానికి టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, కోచింగ్‌ సిబ్బంది, క్రికెటర్లు పాల్గొన్నారు. వీరితోపాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా వెళ్లింది. అనంతరం కార్యాలయ భారత హైకమిషనర్‌, సిబ్బందితో ఫొటోలు దిగారు. ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టుతో గురువారం లార్డ్స్‌ వేదికగా ఆరంభంకానున్న రెండో టెస్టులో కోహ్లీసేన తలపడనుంది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు ముగిసేవరకు జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లు వారి భాగస్వాములు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండాలని ఇటీవల బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు ఆటగాళ్లతో కొనసాగేందుకు వీల్లేదని బోర్డు
చెప్పినప్పటికీ టీమ్‌తో పాటు అనుష్క వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 45రోజుల పర్యటనలో భాగంగా టూర్‌లో తొలి 14 రోజులు ముగిసిన తరువాతనే ఆయా ఆటగాళ్లు వారి భాగస్వాములను కలిసేలా బీసీసీఐ నిబంధనలు కఠినతరం చేసే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అనుష్క శర్మ… టీమిండియా వైస్‌ కెప్టెనా?
భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో పాటు, బీసీసీఐపై నెటిజన్లు మండిపడుతున్నారు. అనుష్క ఏమైనా టీమిండియా వైస్‌ కెప్టెనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా బీసీసీఐ ఓ ఫొటోను పంచుకోవడమే ఇందుకు కారణం. ఆటగాళ్లు ప్రత్యేక ఆహ్వానం మేరకు లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌తో కలిసి అనుష్క కూడా వెళ్లింది. కార్యాలయం ఎదుట అందరూ కలిసి దిగిన ఫొటోను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ఈ ఫొటోలు అనుష్కను చూసి అభిమానులు మండిపడ్డారు. ‘అనుష్క టీమిండియాలో సభ్యురాలా? అనుష్క శర్మ టీమిండియాతో కలిసి ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. ఇది క్రికెట్‌ టూరా? లేక హనీమూన్‌ టూరా? ఇదేవిూ ఫ్యామిలీ ఫంక్షన్‌ కాదు! జట్టు వైస్‌ కెప్టెన్‌ ఏమో ఆఖరి వరుసలో నిల్చుంటే.. అనుష్క ముందు వరుసలో ఉందంటూ నెటిజర్లు విరుచుకుపడ్డారు. టీమిండియాకు అనుష్క శర్మ ఎప్పుడు ఎంపిక అయ్యింది? ఇంతకీ ఆమె టీమిండియాకు బౌలర్‌.. బ్యాటర్‌.. కోచ్‌.. ఏ విధంగా సేవలు అందిస్తోంది? ఆమె ఏమైనా టీమిండియా వైస్‌ కెప్టెనా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.