భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

gold-oct-06

దిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండు లేమితో పాటు అమెరికా ఫెడ్‌ రేట్లు పెరుగుతాయనే వూహాగానాల నేపథ్యంలో బంగారం ధర బాగా తగ్గింది. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండు తగ్గడంతో పసిడి ధర రూ.31వేల దిగువకు పడిపోయింది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.730 తగ్గి రూ.30,520కి చేరింది. ఈ ఏడాదిలో ఒక్క రోజులో తగ్గిన అత్యధిక మొత్తం ఇదే. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర బాగా తగ్గింది. జూన్‌ నుంచి తొలిసారిగా ఔన్సు బంగారం ధర 1300 డాలర్ల దిగువకు పడిపోయింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం 1268డాలర్లుగా ఉంది.వెండి ధర కూడా రికార్డు స్థాయిలో పడిపోయింది. కేజీ వెండి ఏకంగా రూ.1750 తగ్గి రూ.43,250కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి ధర బాగా తగ్గిపోయింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 17.78 డాలర్లుగా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కూడా వెండికి డిమాండ్‌ తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.