భారీగా హరితహారం

నల్లగొండ,జూన్‌13(జ‌నం సాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ అధికారులను ఆదేశించారు. ఈ యేడు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని అన్నారు.జిల్లాకు నిర్దేశించిన 2.20 కోట్ల మొక్కలు నాటేందుకు గ్రామ, మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, పాఠశాలలు, చెర్వుగట్లుపైన, శ్మశాన వాటికల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లలో పండ్ల మొక్కలను నాటేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఉన్న మొక్కలకు అదనంగా 50 లక్షల యూకలిప్టస్‌, మలబార్‌ వేప మొక్కలు కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ఎన్ని అవసరమవుతాయో ప్రధానోపాధ్యాయులతో నివేదికలు తెప్పించుకోవాలన్నారు.