భారీ స్కోరు చేసి టీమిండియా 474 ఆలౌట్

బెంగళూరు: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా రాణించి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించారు. ఓవర్‌నైట్‌ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 347పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ మరో 127పరుగులు సాధించి ఆలౌటైంది. ఆరంభంలోనే అశ్విన్‌(18; 39బంతుల్లో 1×4) వికెట్‌ చేజార్చుకున్నా.. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జడేజా(20; 31బంతుల్లో 1×4, 1×6)తో కలిసి మరో బ్యాట్స్‌మెన్‌ హర్ధిక్‌ పాండ్య(71; 94బంతుల్లో 10×4) ఇన్నింగ్స్‌ నడిపించాడు. ఈ క్రమంలో పాండ్య అర్ధశతకం పూర్తిచేసుకొని శతకం దిశగా అడుగులు వేశాడు. కానీ 99.2ఓవర్‌లో వఫాదర్‌ బౌలింగ్‌లో జజైయ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో హర్ధిక్‌ పోరాటానికి తెరపడింది. అనంతరం అఫ్గాన్‌ బౌలర్లు జోరు కొనసాగించడంతో భారత్‌ 104.5ఓవర్లలో 474పరుగులు చేసి ఆలౌటైంది. చివర్లో ఉమేశ్‌ యాదవ్‌(26నాటౌట్‌; 21బంతుల్లో 2×4, 2×6) కాసేపు మెరిపించాడు.

ఈ క్రమంలో పాండ్యా సహజ శైలికి భిన్నంగా ఆడి కెరీర్‌లో మూడో హఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అతడికి జడేజా తోడవడంతో వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 67 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ జంటను నబీ విడగొట్టాడు. తర్వాతి ఓవర్‌లోనే పాండ్యా కూడా పెవిలియన్‌కు చేరాడు. చివర్లో ఉమేష్ మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
స్కోరు వివరాలు
భారత్ మొదటి ఇన్నింగ్స్: ధవన్ 107, విజయ్ 105, రాహుల్ 54, పుజారా 35, రహానే 10, కార్తిక్ 4, అశ్విన్ 18, పాండ్యా 71, జడేజా 20, ఇషాంత్ 8, ఉమేష్ 26 నాటౌట్; మొత్తం 104.5 ఓవర్లలో 474 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-168, 2-280, 3-284, 4-318, 5-328, 6-334, 7-369, 8-436, 9-440, 10-474
బౌలింగ్: అహ్మద్‌జాయ్‌ 19-7-51-3; వఫాదార్‌ 21-5-100-2; నబీ 13-0-65-1; రషీద్‌ 34.5-2-154-2; ముజీబ్‌ 15-1-75-1; అస్ఘర్‌ 2-0-16-0.