భార్యను చంపిన భర్తపై దాడి
అందోలు: మెదక్‌జిల్లా అందోలు మండలం రాంసానిపల్లి గ్రామంలో ఓ భర్త భార్యను చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భర్తను చితక బాదారు. పరిస్థితిని నిలువరించడానికి వచ్చిన పోలీసులపై కూడా మృతురాలి బంధువులు దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
బాధితుల కథనం ప్రకారం.. అనసూయ(32), సుబుద్ధి అలియాస్ సుకుమార్(40) దంపతులు. రెండేళ్ల కిందట జీవనోపాధి కోసం పటాన్‌చెరు మండలం కృష్ణాపూర్‌కు వచ్చి నివాసముంటున్నారు. దసరా పండుగ సందర్భంగా రాంసానిపల్లి వచ్చారు. పండుగ ఖర్చుల కోసం రూ.5వేలు తెచ్చుకున్నారు. ఆ డబ్బులు మద్యం కోసం భర్త ఖర్చు చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న సుకుమార్ విచక్షణా రహితంగా కొట్టడంతో అనసూయ మృతి చెందింది. దీంతో భయపడిన సుకుమార్.. భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న అందోలు మండలం ఎర్రారం గ్రామానికి చెందిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకొని సుకుమార్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడి చేశారు. దీంతో రాంసానిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.