భార్యపేరున ఇంటిస్థలం ఉంటే వడ్డీలేని రుణం
సింగరేణి కార్మికులకు అధికారుల సూచన
23న కొత్తగూడెంలో ఆవిర్భావ వేడుకలు
భూపాలపల్లి,డిసెంబర్19(జనంసాక్షి): సింగరేణి కార్మికులకు భార్య పేరున ఇంటి స్థలం ఉంటే రూ.10లక్షల వడ్డీ లేని రుణానికి అర్హుడేనని భూపాలపల్లి ఏరియా అధికార ప్రతినిధి, డీజీఎం పర్సనల్ డాక్టర్ రాజేంద్రకుమార్ తెలిపారు. సింగరేణి కార్మికులకు ఇంటి రుణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే ఆమె ఇలాంటి ప్రయోజనం పొంది ఉండకూడదని తెలిపారు. ఒకవేళ భార్యభర్తలు ఇద్దరూ సింగరేణి ఉద్యోగులైతే ఈ అవకాశం ఒక్కరికే వర్తిస్తుందని వివరించారు. ఇదిలావుంటే కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌లో ఈ నెల 23వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ఈ వేడుకల్లో సింగరేణీయులు, కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని డైరెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని ఆనందించి విజయవంతం చేయాలన్నారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉదయం 8:30 గంటలకు హెడ్డాఫీస్ నుంచి స్టేడియం వరకు జరిగే సింగరేణి 2కే రన్‌లో కూడా పాల్గొనాలని, 9:30 గంటలకు స్టేడియంలో సీఎండీ చేతుల విూదుగా పతాకావిష్కరణ ఉంటుందని అన్నారు. ఆ తరువాత సింగరేణి ప్రగతి ప్రతీకల స్టాల్స్‌ను సీఎండీ ప్రారంభిస్తారన్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ప్రముఖ సినీ, టీవీ కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆనందింపజేస్తాయని, ఈ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కోరారు.