భార్య శవంతోనే కొన్నాళ్ళుగా జీవనం..!

11

న్యూఢిల్లీః వారిది సుమారు నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ దాంపత్యం. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరై కొనసాగించిన జీవితం. దీనికి తోడు.. 90 ఏళ్ళ వయసు దాటిపోయిన ఆ భర్త ఆరోగ్యంకూడా అంతంతమాత్రంగానే ఉంది. తీవ్రమైన పోషకాహార లోపానికి తోడు, ఆర్థిక ఇబ్బందులు అతడ్ని మానసికంగా కృంగదీశాయి. దీంతో భార్య చనిపోయిన విషయాన్నీ అతడు గుర్తించలేకపోయాడు. ఆమె బతికే ఉందన్న భ్రమతో కొంతకాలం గడిపేశాడు.

ఢిల్లీలోని కల్కాజీ హౌస్ లో భార్య కుళ్ళిపోయిన శవంతోపాటు జీవిస్తున్న90 ఏళ్ళ గోవింద్ రామ్ జెఠానీని పోలీసులు గుర్తించారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న అతడ్ని వైద్యంకోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే జెఠానీ తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, అందుకే భార్య చనిపోయినా అతడు గుర్తించలేక పోయాడని వైద్యులు తెలిపారు. 90 ఏళ్ళ గోవింద్ రామ్ జెఠానీతోపాటు, అతడి భార్య 85 ఏళ్ళ గోపీ లు ఓ సింగిల్ స్టోరీ భవనంలోని జె-1 బ్లాక్ లో 1974 నుంచీ కలసి జీవిస్తున్నట్లు పోలీసులు సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. ఒకప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే జఠానీ అనంతరం ఉద్యోగం వదిలేసి కొంతకాలంపాటు తన సోదరుడితో కలసి చిన్నపాటి వ్యాపారం నిర్వహించాడు. అక్కడ సమస్యలు ఎదురవ్వడంతో ఎవరికి వారు విడిపోయారు. అనంతరం జెఠానీ చిన్న వ్యాపారం పెట్టేందుకు ప్రయత్నించి విషలం అయ్యాడు. దీంతో పిల్లలు లేని జెఠానీ దంపతులిద్దరూ పోస్టాఫీసులో పొదుపు చేసిన గ్రాట్యుటీ డబ్బుతోనే కాలం గడిపేవారు.

జెఠానీకి ఉన్న ఐదుగురు అన్నదమ్ముల్లో అంతా నగరంలోనే వివిధ ప్రాంతాల్లో నివసించినా ఎవ్వరూ పెద్దగా కలుసుకునేవారు కాదు. ఒక్క మేనల్లుడు నరేందర్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసి పోతుండేవాడని ఇరుగు పొరుగులు తెలిపారు. నరేందర్ సైతం ఆర్నెల్లకో, సంవత్సరానికో ఓసారి వచ్చి ఈ వృద్ధ దంపతుల్ని పలకరించి, వారు పోస్టాఫీసులో దాచుకున్న డబ్బుకు సంబంధించిన 8000 రూపాయల వడ్డీని వారికి అందించి వెడుతుండేవాడు. జెఠానీ దంపతులిద్దరికీ ఇతర ఖర్చులేవీ లేకపోవడంతో వారిద్దరూ ఆ డబ్బుతోనే సరిపెట్టుకునేవారనుకున్నానని, అంతకు మించి వారి స్థితి గతుల గురించి ఎప్పుడూ వారు బయటకు చెప్పలేదని నరేందర్ తెలిపాడు.

ఇదిలా ఉంటే.. ఆ వృద్ధ దంపతులిద్దరూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారని, దాంతో ఒక్కపూటే భోజనం చేసేవారని, దీనికి తోడు అనారోగ్యం కూడా ఉండటంతో జెఠానీ చాలా అరుదుగా బయటకు వెళ్ళేవాడని అక్కడి వారు చెప్తున్నారు. ఇరుగు పొరుగులెవరితో ఆ దంపతులిద్దరూ పెద్దగా మాట్లాడేవారే కాదని, వీలైనంత వరకూ పక్కవారికి దూరంగా ఉండేందుకే ప్రయత్నించేవారని మరో పక్కింటి వ్యక్తి ప్రదీప్ కుమార్ తెలిపాడు. ఆదివారం జెఠానీ తన ఇంటినుంచీ బయటకు వచ్చి న్యాయ వాది అయిన పొరుగింటి ప్రమోద్ ను పిలిచి, తన భార్య గోపీ కొన్నాళ్ళుగా  పిలిచినా పలకడం లేదని చెప్పడంతో ఆసలు విషయం తెలిసిందని, ప్రమోద్ వెళ్ళి చూడగా నేలపై కుళ్ళిపోయి, పురుగుల పట్టిన శవం కనిపించడంతో అతడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు తీవ్ర అనారోగ్యంతో ఉన్న జెఠానీని ఆస్పత్రికి తరలించి, భార్య గోపీ శవాన్నిఅంత్యక్రియలకోసం మేనల్లుడు నరేందర్ కు అందజేశారు.