భార‌త్‌తో పాక్ వ్యాపార సంబంధాలు ర‌ద్దు?

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుత ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో భార‌త్‌తో వ్యాపార సంబంధాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ పాకిస్థాన్ చాంబ‌ర్స్‌ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ (ఎఫ్‌పీసీసీఐ) భావిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భార‌త్‌తో వాణిజ్యం కొన‌సాగించ‌డం క‌ష్ట‌మ‌ని, ఈ విష‌యంలో తామంతా స‌మ‌ష్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స‌మాఖ్య అధ్య‌క్షుడు అబ్దుల్ రౌఫ్ ఆల‌మ్ తెలిపారు. అయితే దీని ప్ర‌భావం భార‌త్‌పై ఏమాత్రం ఉండ‌బోద‌ని అసోచామ్ ఇప్ప‌టికే స్ప‌ష్టంచేసింది. 2015-16లో భార‌త్ మొత్తం వాణిజ్యం విలువ 64,100 కోట్ల డాల‌ర్లు కాగా.. అందులో పాకిస్థాన్ వాటా కేవ‌లం 267 కోట్లు మాత్ర‌మేన‌ని అసోచామ్ తెలిపింది.

ఒక‌వేళ ఇండియాతో సంబంధాల‌ను ర‌ద్దు చేసుకుంటే.. తాము ఎక‌న‌మిక్ కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్‌, డీ8 దేశాల‌తో సంబంధాల‌ను మెరుగుప‌ర‌చుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆల‌మ్ అన్నారు. ఈసీవోలో ఇరాన్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌, అజ‌ర్‌బైజాన్‌, క‌జ‌క్‌స్థాన్‌, కిర్గిస్థాన్‌, త‌జికిస్థాన్‌, తుర్క‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్ స‌భ్య‌దేశాలుగా ఉండ‌గా.. డీ8లో బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, ఇండోనేషియా, ఇరాన్‌, మ‌లేషియా, నైజీరియా, పాకిస్థాన్‌, ట‌ర్కీ ఉన్నాయి. భార‌త్ ప్ర‌పంచ వాణిజ్యంలో పాక్ వాటా అర‌శాతం కూడా లేద‌ని అసోచామ్ తెలిపింది.