భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం..కమల్‌హాసన్‌

చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎమ్‌) అధినేత కమల్‌హాసన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ 8వ వ్యవస్థాపక దినం సందర్భంగా కమలహాసన్‌ మాట్లాడారు.‘తమిళులకు భాష చాలా ముఖ్యమైనది. మాతో ఈ విషయంలో ఆలలొద్దు.భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం.మా పిల్లలకు కూడా ఏ భాష కావాలో తెలుసు.ఏ భాష కావాలో ఎంపిక చేసుకునే జ్ఞానం వారికి ఉంది’అని పరోక్షంగా కేంద్రం తీసుకువచ్చిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ)ని ఉద్దేశించి కమల్‌ వ్యాఖ్యానించారు.తమిళనాడులో రెండు భాషల విధానం అమలులో ఉండగా ఎన్‌ఈపీ కింద హిందీతో కలిపి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిని అధికార డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఎన్‌ఈపీ అమలు చేయకపోతే తమిళనాడుకు రావాల్సిన రూ.2152 కోట్ల సమగ్రశిక్షాఅభియాన్‌ నిధులు నిలిపివేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ ఇప్పటికే హెచ్చరించారు. ప్రదాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం స్టాలిన్‌ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఈ లేఖపై ప్రదాన్‌ తిరిగి స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు వదిలేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు.ఈ విషయమై తాజాగా ప్రధాని మోదీ కూడా పరోక్షంగా స్పందించారు. దేశంలో భాషల పట్ల శత్రుత్వం సృష్టించొద్దని కోరారు.