భీవండి కోర్టుకు హాజరైన రాహుల్‌

ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలపై తప్పు చేయలేదని వ్యాఖ్య

ముంబై,జూన్‌12(జ‌నం సాక్షి): పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం భీవాండి కోర్టు ముందు హాజరయ్యారు. మహాత్మాగాంధీని చంపింది ఆర్‌ఎస్‌ఎస్‌ అని రాహుల్‌ గతంలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన రాజేశ్‌ కుంటే పరువునష్టం కేసును దాఖలు చేశారు. ఆ కేసులో ఇప్పటికే అనేకసార్లు వాదనలు జరిగాయి. తాజాగా రాహుల్‌ కోర్టు ముందు తాను తప్పు చేయలేదని వాదించారు. ఐపీసీ సెక్షన్‌ 499, 500 కింద ఈ కేసులో అభియోగాలు నమోదు అయ్యాయి. ముంబై నుంచి ఉదయం భీవాండి కోర్టుకు రాహుల్‌ చేరుకున్నారు. గత నెలలో జరిగిన వాదనలకు రాహుల్‌ హాజరుకాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి విముక్తి కల్పించాలని అప్పుడు రాహుల్‌ తరపున న్యాయవాది కోర్టును కోరారు. కోర్టు ముందు రాహుల్‌ హాజరు కావాలంటూ జనవరి 17న ఇచ్చిన తీర్పులో భీవాండి కోర్టు ఆదేశించింది. దీంతో రాహుల్‌ మంగళవారం విధిగా హాజరయ్యారు.