భువనగిరి అభివృద్దిలో పైళ్లదే కీలకం
కూటమి నేతలను నమ్మొద్దన్న మంత్రి హరీష్ రావు
భువనగరి,నవంబర్ 26(జనంసాక్షి): కాళేశ్వరంతో భువనగరి పచ్చబడబోతున్నదని టీఆర్‌ఎస్ నేత,మంత్రి హరీష్‌రావు అన్నారు. భువనగిరిలో మాధవరెడ్డి తరవాత ఇప్పుడే అభివృది జరిగిందన్నారు. అనేక కార్యక్రమాలను అమలు చేసిన వ్యక్తిగా పైళ్ల శేఖర్ రెడ్డి ముందున్నారని అన్నారు. భువనగిరి నియోజకవర్గం వలిగొండలో మంత్రి హరీశ్ రావు రోడ్ షో నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ నేత ఉమా మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మహాకూటమి విచ్ఛిన్నమైందని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. కూటమి పార్టీలకే ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని విమర్శించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మైండ్‌గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చిందన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే కాంగ్రెస్ పనిచేస్తోందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. భువనగిరి నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండాయేనని, టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి విజయం ఖాయమన్నారు. విపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు ఆంధ్రానుంచి డబ్బులు పంపిస్తున్నాడని, కాంగ్రెస్ నేతలు పంచే డబ్బులకు ఆశపడితే ఆగమైపోతామని హెచ్చరించారు. కాంగ్రెస్ గెలిస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ ను మూసేస్తామని కోమటిరెడ్డి
వెంకట్ రెడ్డి చెబుతుండని.. ఇదే జరిగితే వెలుగుల తెలంగాణ చిమ్మచీకటి అయితదన్నారు. వానాకాలంలో ఉశిళ్ళు వచ్చినట్లే? ఎన్నికలప్పుడు కాంగ్రెసోళ్లు వస్తారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ టీఆర్‌ఎస్ అని చెప్పారు. కూటమిలో ఉన్న నాయకులకే పొంతనలేదని, ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్ళ పార్టీల మధ్యే ఐక్యత లేదని, ఇక పరిపాలనేం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ అధికారంలోకి రాదని వాళ్లకు తెలిసిపోయిందన్నారు. రైతు బంధు కొనసాగాలంటే టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. భువనగిరిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నాడు మాధవరెడ్డి హయాంలో, నేడు పైళ్ల శేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చి, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ వైపా? నోటికాడి తిండిని అడ్డుకోవాలనుకుంటున్న చంద్రబాబు కావాలో ఆలోచించుకోవాలని కోరారు.