భువనగిరి బగాయత్కు విముక్తి ఎప్పుడో?
అమలు కాని మాస్టర్‌ప్లాన్
భువనగిరి,జూలై18(జనం సాక్షి): భువనగిరి బాగాయత్ సర్వే నెంబరు మాస్టర్ ప్లాన్‌లో నమోదు చేయక పోవడంతో సాంకేతికంగా ఈ సమస్య తలెత్తుతోంది. దీంతో మ్యాప్ ప్రకారం రెండు గ్రామాల్లోని సర్వే నెంబర్లపై అవగాహనలేని అధికారులు యజమానులను గందరగోళానికి గురిచేస్తున్నారు. భువనగిరి బగాయత్ పేరుతో ఓ గ్రామం ఉందన్న విషయాన్ని తెలుసుకోకుండానే హెచ్ఎండీఏ అధికారులు భూములు, ఇళ్ల స్థలాల యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులుపట్టించుకుని జరిగిన తప్పును సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాల్సి ఉంది. మాస్టర్ ప్లాన్‌లో భువనగిరి బగాయత్ సర్వే నెంబర్లు నమోదు చేయని కారణంగా ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించలేక పోతున్నట్లు ప్లానింగ్ అధికారులు తెలిపారు. భవనగిరి బగాయత్‌లోని కొన్ని సర్వే నెంబర్లలో కొందరికి అనుమతులు ఇచ్చిన విషయం పరిశీలిస్తామని అన్నారు. హైదరాబాదు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధికి రూపొందించిన బృహత్ ప్రణాళిక రూపకల్పనలో అధికారులు చేసిన తప్పిదం ప్రజల పాలిట శాపంగా మారింది. భువనగిరిలో భాగమైన భువనగిరి బగాయత్ గ్రామ సర్వే నెంబర్లు బృహత్ ప్రణాళికలో నమోదు కాలేదు. ఈ కారణంగా నాలుగేళ్లుగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాదుపై ఉన్న అన్ని రకాల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం 2008లో హుడాను రద్దు చేసి హెచ్ఎండీఏకు రూపకల్పన చేసింది. దీని ప్రకారమే హెచ్ఎండీఏ అధికారులు భూముల క్రమబద్ధీకరణ, నిర్మాణ పనులకు అనుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వ రెవెన్యూ దస్త్రాల్లో భువనగిరి బగాయత్ గ్రామం ఉన్నప్పటికి మాస్టర్ ప్లాన్‌లో ఈ గ్రామ భూముల సర్వే నెంబర్లు నమోదు చేయలేదు. ఫలితంగా నాలుగేళ్లగా భువనగిరి బగాయత్ పరిధిలోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, నిర్మాణ అనుమతులు నిలిచిపోయాయి. అధికారులు చేసిన తప్పిదంతో అనుమతులు, క్రమబద్ధీకరణకు భూముల యజమానులు తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి చెప్పులరిగేలా తిరుగుతున్నప్పటికీ ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ నేటికీ జరగలేదు. భువనగిరి పట్టణం, భువనగిరి బగాయత్ గ్రామం, హుస్సేనాబాద్తో పాటు అనంతారంలోని కొన్ని సర్వే నెంబర్లలోని భూమి పురపాలక సంఘం పరిధిలో ఉంది. మాస్టర్‌ప్లాన్‌లో మూడు ప్రాంతాల సర్వే నెంబర్లు నమోదు చేసిన అధికారులు భువనగిరి బగాయత్ గ్రామ పరిధిలోని భూముల సర్వే నెంబర్లను విస్మరించారు. రెవెన్యూ దస్త్రాల ప్రకారం భువనగిరి బగాయత్ గ్రామంలో 130 సర్వే నెంబర్లు ఉన్నాయి.