భూపట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సంగారెడ్డి, నవంబర్ 9 (: ఆరోవిడుత భూపంపిణీలో భాగంగా చేగుంట మండలంలో రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి భూమి పట్టాలను పంపిణీ చేశారు. శుక్రవారంనాడు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్దిదారులకు భూపట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పట్టాలను ఇవ్వడం ద్వారా ఆ భూమి యాజమాన్య హక్కులు వచ్చాయన్నారు. గతంలో కాకుండా సాగు చేయడానికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి వీలు కలిగిందన్నారు. లబ్దిదారులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేసుకొని ఏ పంట పండిస్తే లాభం వస్తుందో ఆ పంటను వేసి ఆర్థికంగా లబ్ది పొందాలన్నారు. గత 5 విడుతలుగా భూపంపిణీ వల్ల వందలాది మంది రైతులకు ఆ భూములపై యాజమాన్య హక్కు కలిగిందని, ఆ భూములను అమ్మడానికి వీలులేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములు ఎవరు ఖరీదు చేసిన చట్టపరంగా నేరస్థులవుతారన్నారు. ప్రభుత్వం డ్రిపు ఇరిగేషన్, స్ప్రింకర్లు సబ్సిడీపై ఇస్తున్నారని తెలిపారు. రైతులు పండించిచన పంటలకు గిట్టుబాటు ధర కల్పిండానికి ఐకెపిల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ఆయన తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో పంటలు విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ సబ్ కలెక్టర భారతి హోళ్లీకేరి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చేగుంటలో మొక్కలు నాటారు.