భూమి రికార్డుల కంప్యూటరీకరణ
రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదలి పెట్టకుండా సేద్యం చేయడానికి వీలుగా సర్కారు ప్రణాళికలు రూపొందిస్తున్నది. యజమాని భూమికి భద్రత కల్పిస్తూ, కౌలు రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్ మార్గనిర్దేశాల నేపథ్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నది.
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు టీఆర్ఎస్ సర్కారు పట్టుదలతో ఉంది. ప్రతిఎకరా పండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమి రికార్డులను కంప్యూటరీకరణ చేసి, యాజమాన్య హక్కులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంది. దీంతో సీసీఎల్ఏ రూపొందించిన వెబ్ ల్యాండ్ నూతన సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీనిద్వారా అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా తన భూమి ఏవిధంగా ఉంది, రికార్డులు ఎలా ఉన్నాయి, ఎవరైనా కబ్జా చేస్తున్నారా? అనే అంశాలను అక్కడి నుంచే చూసుకునే అవకాశముంది. భూమిని కబ్జాపాలు కాకుండా చూడటమే కాకుండా.. ఆ భూమిని ఎవరో ఒకరు సాగు చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. నీతి ఆయోగ్ చేసిన ఈ సూచన మేరకు రాష్ట్రంలో ఉన్న బీడు భూములన్నింటినీ సాగులోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వమే ఏర్పాటు చేసి, దాని నిర్వహణ రెవెన్యూ విభాగానికి అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. దీంతో భూమిని కౌలుకు ఇవ్వాలని భావించే రైతులు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ల్యాండ్ బ్యాంక్‌కు అప్పగిస్తారు. ఏ రకం భూమికి ఎంత కౌలుకు ఇవ్వాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. భూమిని కౌలుకు చేయాలనుకునే ఔత్సాహిక రైతులు ల్యాండ్ బ్యాంక్‌నే నేరుగా సంప్రదించి కౌలుకు తీసుకుంటారు. ఇలా భూమిని కౌలుకు తీసుకున్న రైతులకు బ్యాంకులు నేరుగా రుణాలు ఇచ్చే విధంగా భరోసా ఇస్తారు. భూమిని కౌలుకు తీసుకున్న రైతుకు వెంటనే రుణ అర్హత కార్డు ఇస్తారు. దీనితో కౌలు రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తారు.