భూములిచ్చేస్తాం
– ఎర్రవెల్లి గ్రామస్థులతో హరీశ్ చర్చలు సఫలం
మెదక్,జులై 28(జనంసాక్షి): ప్రతిపక్షాల కుట్రలను మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు తిప్పికొడుతున్నారు. మంత్రి హరీష్ రావు మంత్రాంగం ఫలిస్తోంది. వరుసగా రెండోరోజు ఆయన ప్రజలను ఒప్పించి భూములు ఇచ్చేలా చేశారు. ఎర్రవల్లి గ్రామస్థులతో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ముంపు గ్రామాల ప్రజలకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌కు భూములు ఇచ్చిన రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. బంగారు తెలంగాణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని ఎర్రవల్లి గ్రామప్రజలు స్పష్టం చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు ఇళ్లుకట్టిస్తామని అన్నారు. విపక్షాలు చేసిన కుట్రలను ముంపు గ్రామాల ప్రజలకు హరీష్‌రావు వివరిస్తూ మల్లన్నసాగర్‌కు అడ్డంకులు లేకుండా చేస్తున్నారు. బుధశారం పల్లెపహాడ్ గ్రామప్రజలు ముందుకు రాగా గురువారం ఎర్రవల్లి గ్రామస్థులు మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. 123 జీవో ప్రకారం భూములు ఇచ్చేందుకు ఎర్రవల్లి ప్రజలు ఒప్పుకున్నారు. భూములు ఇస్తామంటూ హరీష్‌రావుకు గ్రామస్థులు లిఖితపూర్వక పత్రం ఇచ్చారు. లిఖితపూర్వక పత్రంపై గ్రామస్థులు, రైతులు సంతకాలు చేశారు.