భూసార పరీక్షల మేరకు పంటలు

యాదాద్రి భువనగిరి,జూలై12(జ‌నం సాక్షి): జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భువనగిరిలో విత్తనశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విత్తనాలను ఉత్పత్తిచేసే గ్రామాలను గుర్తించి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పంటల బీమా పథకాన్ని ప్రతి రైతు వినియోగించుకునేలా ప్రచారం నిర్వహించి వారిని చైతన్యపరచాలన్నారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు, బునాదిగాని, బొల్లేపల్లి కాల్వ, యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఎన్‌హెచ్‌165, 65కు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఇటీవల కలెక్టర్‌ కూడా ఆదేశించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సంక్షేమ వసతిగృహాల్లో పూర్తిస్థాయి ప్రవేశాలు కల్పించడంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు సరిపడ మంచాల కోసం వసతిగృహాల వారీగా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సవిూక్షిస్తూ గ్రామాలవారీగా గర్భిణుల సంఖ్య, తదితర వివరాలను సేకరించి వారికి కావాల్సిన పౌష్టికాహారం అందించాలన్నారు.