భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం-మంత్రి మహేందర్‌ రెడ్డి

సంగారెడ్డి,ఆగస్టు28 : భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం, ఎక్స్‌ గ్రేషియా దక్కేలా చూస్తామని రాష్ట్ర మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మేడిపల్లి నక్కర్తలో ఫార్మా సిటీ భూ నిర్వాసితులకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి 8 కోట్ల ఎక్స్‌ గ్రేషియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మా సిటీ భూ నిర్వాసితులైన మేడిపల్లి, నక్కర్త, నానక్‌ నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తొలి విడతగా 169 మంది రైతులకు మంత్రి మహేందర్‌ రెడ్డి ఎక్స్‌ గ్రేషియా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.