భూ రికార్డులకు  ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

మెదక్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూసమస్యలను పరిష్కరించగా మిగిలిపోయిన  సమస్యలు ఇంకేమైనా ఉంటే పరిష్కరించడానికి  గ్రామసభలు నిర్వహిస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. గ్రామంలోని రైతులు ఏమైనా భూ సమస్యలు ఉంటే ఈ గ్రామసభల్లో పరిష్కరించుకోవాలని తెలిపారు. గ్రామసభలు నిర్వహించి భూ రికార్డుల్లో ఉన్న సమస్యలను తీరుస్తున్నామన్నారు. అలాగే ఇప్పటి వరకు ఆధార్‌ నమోదు చేసుకోని రైతులు వెంటనే ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. భూసమస్యలున్న రైతులు గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ గ్రామసభలో పాల్గొని రైతులను వారి భూసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి భూరికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ ఇంకా భూసమస్యలు పూర్తి కాలేదని ప్రభుత్వం దృష్టికి రావడంతో గ్రామసభలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకే అన్ని గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో భూసమస్యలున్న రైతులు సంబంధిత కాగితాలతో రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించుకోవాలని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనలో మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించేందుకు గాను గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి కొత్తగా జారీ చేసిన పట్టాపాసుపుస్తకాల్లో వచ్చిన తప్పులు, ఇతర భూ సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.

తాజావార్తలు