భూ సర్వేతో వివాదాలకు చెక్‌: ఎమ్మెల్యే

జనగామ,నవంబర్‌30(జ‌నంసాక్షి): భూ రికార్డుల ప్రక్షాళనతో గ్రామాల్లో భూ వివాదాలకు చెక్‌ పడనుందని ఎమ్మెల్యే ముత్తి రెడ్డి అన్నారు. ఇందుకు ససర్వే ద్వారా ఎవరి భూమి ఎక్కడ అన్నది తెలియనుందన్నారు. గ్రామాల్లో వివిధ రకాల భూ వివరాలు గందరగోళంగా ఉండడంతో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. రికార్డుల్లో పట్టాదారు కాలంలో ఒకరు, వాస్తవ కబ్జాలో మరొకరి పేరిట పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు ఉండడంతో ప్రభుత్వం ఈ ఏడాది సర్వేకు ఆదేశించిందన్నారు.

దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు సర్వే తోడ్పడుతుందని అన్నారు. భూ సంబంధిత వివాదాలకు చెక్‌ పడుతోందన్నారు. సర్వే ద్వారా సేకరిస్తున్న భూముల లెక్కలను కంప్యూటరీకరణ చేపట్టిన ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా రైతులకు జనవరి నుంచి ఎలక్టాన్రిక్‌ ఈ-పాస్‌ బుక్‌ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భవిష్యత్‌లో ఏలాంటి భూ సమస్యలు లేకుండా భూ రికార్డుల ప్రక్షాళనతో సమస్యలకు శాశ్వతపరిష్కరం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. డిసెంబర్‌ నాటికి పక్రియను పూర్తిచేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదైన 1-బీ ఆధారంగా రైతులకు బ్యాంకు రుణాలు అందజేసేందుకు కసరత్తు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13మండలాల్లో గత రికార్డుల ప్రకారం

సర్వేనంబర్లు వాటికి అనుబంధంగా ఉన్న బై నంబర్లు కలిపి భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా భూముల రీసర్వే జరుగుతోంది. దశాబ్దాల క్రితం నిజాం హయాంలో వదిలేసిన సర్వే విధానాన్ని ప్రవేశపెట్టి గ్రామాన్ని యూనిట్‌గా రీసర్వే చేస్తున్నారు. కంప్యూటీకరణలో భాగంగా ఆన్‌లైన్‌ నమోదులో పట్టాదారుల పేర్లు, సర్వేనంబర్లు మారడం, కొందరు భూ యజమానుల వివరాలు మాయం కావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రెవెన్యూశాఖ నడుంబిగించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌, పట్టా వంటి వివిధ రకాల భూముల లెక్కలు బహిర్గతం అవుతున్నాయి.

డిసెంబర్‌ నాటికి పూర్తిస్థాయిలో వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని తెలంగాణ భూ రికార్డుల పద్ధతి ఆధ్వర్యంలో మరోసారి కంప్యూటరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజాం కాలంలో కాస్రాసేత్వార్‌, పాత రికార్డులు, పహాణీతోపాటు తాజాగా సర్వేలో సేకరించిన సమగ్ర సమాచారంతో పొరపాట్లను వందశాతం సవరించి కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. వివాదాస్పద, కోర్టు పరిధిలోని అంశాలు, చనిపోయిన వారి భూముల వివరాలను సేకరించి తుది జాబితాను తయారు చేస్తారు.

భూ యజమానులకు మాన్యువల్‌ పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్‌డీడ్‌ ఇస్తుండటంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పాసు పుస్తకాల్లో భూ విస్తీర్ణం టాంపరింగ్‌కు గురికావడంతోపాటు కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తప్పుడు వివరాలు నమోదవుతున్నాయి. భూమమలు కొన్నవారు పాసు పుస్తకాలు, టైటిల్‌డీడ్‌ పొందాలంటే తీవ్ర జాప్యం జరుగుతోంది. భూరికార్డుల సర్వే పూర్తయిన అనంతరం సమగ్ర వివరాలను గ్రామాల్లో ప్రదర్శించి వీటిపై అభ్యంతరాలను మళ్లీ స్వీకరించడంతోపాటు కొత్తగా జారీచేసే ఈ-పాస్‌ బుక్‌లను సరిచేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.