మంచిర్యాలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి
ఆదిలాబాద్, ఆగస్టు 2 : విస్తీర్ణంలో జిల్లా పెద్దది కావడం, పరీక్షలన్నీ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో వ్యవప్రయాసాలకు గురవుతున్నారు. వివిధ అర్హత పరీక్షలు, ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలన్నీ ఆదిలాబాద్‌లో నిర్వహించడం వల్ల దూర ప్రాంత అభ్యర్థులకు ఆర్థికంగా ఎంతో భారమవుతుంది. బీఎడ్, డీఎల్, డీఎస్సీ, గ్రూప్స్‌కు సంబంధించిన పరీక్షలన్నీ ఆదిలాబాద్‌లో నిర్వహించడం వల్ల తూర్పు ప్రాంతమైన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాలలోని అభ్యర్థులు ఆదిలాబాద్‌కు వచ్చి పరీక్షలు రాయడం వల్ల సమయం వృధా కావడమే కాకుండా ఆర్థికంగా ఎంతో భారమవుతోంది. గతంలో నిరుద్యో అభ్యర్థులు, విద్యార్థులతో పాటు వివిధ యువజన సంఘాలు మంచిర్యాలలో మరో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలో 30వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో 75 శాతం మేరకు తూర్పు ప్రాంతం నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయాలంటే దూరభారంతో పాటు ఆర్థిక భారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు డీఎస్సీ పరీక్షను మంచిర్యాలలో నిర్వహిస్తే తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు అంటున్నారు. ఈ విషయమై ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరుద్యోగ అభ్యర్థుల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపాలన్నారు.