‘మంచు’కొస్తున్న పెనుముప్పు

హిమ ఖండంలో వేగంగా కరుగుతున్న మంచు

న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : కనుచూపు మేర విస్తరించిన మంచు.. కనువిందు చేసే హిమ సౌందర్యం అంటార్కిటికా ఖండానికే సొంతం. పెంగ్విన్ల సోయగాలు, ధ్రువపు ప్రాంత జంతువులతో అలరారే ఈ మంచు ఖండం ఓ భారీ ముప్పును ఎదుర్కోనుంది. అంతేకాదు యావత్తు ప్రపంచానికి పెనుముప్పు తీసుకురానుంది. మానవుని అత్యాశ కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతున్న వేళ.. సమస్త మానవాళిని ఆందోళన పరిచేలా అంటార్కిటికా ఖండంలో మంచు కరిగిపోతోంది. తద్వారా సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటార్కిటికాలో ఖండంలో మంచు వేగంగా కరుగుతోంది. అదీ మామూలుగా కాదు.. ప్రపంచ దేశాలను కలవరపరిచే రీతిలో.. అంతర్జాతీయ శాస్త్రవేత్తలను ఆందోళన కలిగించే స్థాయిలో.. హిమఖండంలో గతంలో కంటే మూడురెట్లు వేగంగా మంచు కరుగుతున్నట్లు తాజాగా విడుదలైన ఓ అధ్యయనం వెల్లడించింది. అంటార్కిటికాలో ఉన్న మంచు ఫలకాలపై గ్లోబల్‌ వార్మింగ్‌ చూపుతున్న ప్రభావాన్ని నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీల సాయంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది. అంటార్కిటికాలో మంచు కరగడంపై గతంలో అనేక అధ్యయనాలు వెల్లడైనా 10 నుంచి 15 ఉపగ్రహాలను వినియోగించి 24 ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తల బృందం అధ్యయనం జరిపింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను విశ్లేషించి భవిష్యత్తులో ఎదురయ్యే పర్యవసానాలను అంచనా వేసేందుకు నిర్వహించిన ఈ పరిశోధనలో కఠోర వాస్తవాలు వెల్లడయ్యాయి.