మండుతున్న ఎండలకు ఎండుతున్న పొలాలు

పంటలకు చివరి తడుల కోసం రైతుల పాట్లు

రంగారెడ్డి,జ‌నం సాక్షి): ఎండలు భగభగా మండుతుండటంతో చెరువులు ఖాళీ అవుతున్నాయి. వాటిలోని నీటిని నమ్ముకుని సాగుచేసిన వరి చివరి దశలో ఎండిపోతోంది. ప్రస్తుతం వరి పైర్లు కంకులు వేసే దశలో ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగానే చెరువుల్లోని నీరు తూముల కంటే దిగువకు వెళ్లి పోయింది. ఆయకట్టు పొలాలకు నీరు పారడంలేదు. కొన్నిచోట్ల పైర్లు ఎండిపోతున్నాయి. మరికొన్ని పశువుల మేతగా మారాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. ఒకట్రెండు తడులు అందిస్తే చాలు పంట చేతికందేదని వాపోతున్నారు. బోరుబావుల్లోనూ రోజురోజుకూ భూగర్భ జలం మరింత లోతుకు పడిపోతోంది. కిలోవిూటర్ల దూరం నుంచి కూడా నీటిని తీసుకువచ్చి పంటను రక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఫలించడం లేదు. దీంతో ఇప్పటికే చాలావరకు ఎండిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లోని చెరువులు నిండటంతో రైతులు సంతోషించారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌, కొడంగల్‌, బొంరాస్‌పేట మండలాల్లో సాధారణంకంటే కాస్త తక్కువగానే వానలు పడ్డాయి. మొత్తంగా చూస్తే జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి పంట అధిక విస్తీర్ణంలోనే వేశారు. వికారాబాద్‌లో ఇతర పంటలవైపు మళ్లడంతో సాగు తగ్గింది. వ్యవసాయానికి రోజుకు తొమ్మిది గంటలపాటు విద్యుత్తును సరఫరా చేస్తున్నా ఎండలకు ఉన్ననీరు ఆవిరైపోవడంతో మళ్లీ కరెంటు సరఫరా జరిగే వరకు ఆగాల్సివస్తోంది. దీంతో పైర్లను బతికించు కోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిగి, కొడంగల్‌ ప్రాంతాల్లో ఇలా

చేయడానికి కూడా భూగర్భంలో నీరు ఉండటంలేదు. తాండూరు డివిజన్‌లో చెరువుల కింద రెండు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. వారం రోజుల వరకు చెరువుల్లోని నీటిని పుష్కలంగా పారించారు. దీంతో పైర్లు ఏపుగా పెరిగాయి. ముందుగా వేసిన పైర్లు మరో ఇరవై రోజులైతే కోతకు వస్తాయి. కాస్త ఆలస్యంగా వేసినవే దక్కేలా లేవు. ఆర్థికంగా ఉన్న రైతులు ట్రాక్టర్ల ఇంజిన్లు, డైనొమోల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వినియోగించి బోర్ల ద్వారా నీరు పారిస్తున్నారు. కొందరు తమ వద్ద డబ్బులు లేకున్నా అప్పులు చేసి మరీ ట్రాక్టర్‌ల ఆధారంగా నీటిని పారిస్తున్నారు. మరికొందరు రైతులు ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో పైర్లను అలాగే వదిలేయడంతో కొన్ని వాడిపోతే మరికొన్ని ఎండిపోతున్నాయి. అయితే భానుడి భగభగల కారణంగా చెరువుల్లోని నీరు రోజుకు ఇంత చొప్పున ఆవిరై పోతోంది. ప్రస్తుతం కొన్ని పైర్లు పొట్ట పోసుకునే స్థితిలో ఉంటే మరి కొన్ని పైర్లు కంకుల దశలో ఉన్నాయి. పైర్లు చేతికి అందే వరకు జలాశయంలో నీటి

పరిస్థితి ఎలా ఉంటుందో ననే విషయంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గింజలు గట్టిపడే సమయంలో తూముకు అందకుండా నీళ్లు దూరంగా వెళ్లటంతో పదిరోజులుగా పంటలకు నీటి సరఫరా ఆగిపోయింది. వ్యవసాయబోర్లు అందుబాటులో ఉన్నవాళ్లు నీళ్లు పెడుతుంతడగా మిగిలినవారి పంటలు ఎండిపోతున్నాయి.విద్యుత్తు మోటార్లు, అయిదు ఆయిల్‌ ఇంజిన్లు ఏర్పాటుచేసుకొని నీళ్లను తూము దగ్గరకు

తోడేస్తున్నారు.