ఇంటి స్ధలంపై రగడ… కర్ణాటక న్యాయమంత్రి రాజీనామా
బెంగళూర్, జూన్23: వరుస అసమ్మతులు, రాజకీయ సంక్షోబాల నడుమ కర్ణాటక పాలకపక్షం బీజేపీ మరోసారి ఇబ్బందుల్లో పడింది. సీనియర్ మంత్రి ఒకరు అక్రమంగా ప్రభుత్వ స్థలం పొందారని ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. తప్పుడు పత్రాల్ని సమర్పించి, నియమావళికి విరుద్ధంగా బెంగళూర్‌లో ఇంటిస్థలం పొందారనే ఆరోపణపై న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి సురేష్‌కుమార్ శనివారం ఉదయం ఇక్కడ తన పదవికీ రాజీనామా చేశారు. అయితే రాజీనామాను ఆమోదించేందుకు ముఖ్యమంత్రి సదానందగౌడ తిరస్కరించారు, ఆ వివాదం గురించి అన్ని వివవరాలు తెలుసుకుంటామని తెలిపారు. ఇంటి స్థలం వివాదం వల్ల ఆయన రాజీనామా చేయాల్సిన పనిలేదు. దానిపై విచారణ కూడా అనవసరం అని తేల్చిచెప్పారు. సురేశ్‌కుమార్ ఇంటిస్థలం వ్యవహరాన్ని సామాజిక కార్యకర్త ఆర్.భాస్కర్‌న్ బెంగళూర్ అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) నుంచి సేకరించి శనివారం స్థానిక మీడియాలో బహిర్గతం చేయటంతో రచ్చ మొదలైంది. ఆయన తనకు నగరంలో ఎటువంటి ఇళ్ల స్థలాలు లేవంటూ 2009 జనవరిలో సర్కారుకు పిటిషన్ పెట్టుకోగా, 2010లో స్థలం మంజూరైంది. అనివార్య కారణాల వల్ల దానిని రద్దుచేసి రాజమహాల్ విలాస్ ప్రాంతంలో కేటాయించారు.