మంత్రాల నెపంతో కుటుంబంపై దాడి: ఒకరి మృతి

మెదక్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : మంత్రాల నెపంతో చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా కొందరు మరణించడంతో అనుమానం పెనుభూతంగా మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబంపై బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు దాడి చేశారు. ఈ దాడిలో రొడ్డ రామస్వామి(60) మృతి చెందాడు. ముప్పిరెడ్డిపల్లిలో కొన్ని రోజులుగా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మృత్యువాత పడుతున్నారని, రామస్వామి మంత్రాలు చేస్తుండడమే ఇందుకు కారణమని నిందితులు ఆరోపిస్తున్నారు. విచక్షణా రహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. రామస్వామి భార్య పోచమ్మ, కుమారుడు సాయి, కూతురు రేణుక తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పెకిటింగ్‌ నిర్వహిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.